
రైతన్న ధర్మాగ్రహం
రైతన్నలు కన్నెర్ర చేశారు. భుక్తినిచ్చే భూమిని లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కూటమి సర్కార్ చేస్తున్న కుటిల యత్నాలను నిరసించారు. వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి హిందూపురంలో కవాతు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దుమ్మెత్తిపోశారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
చిలమత్తూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణపై రైతులు పోరుబాట పట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు గురువారం హిందూపురంలో భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకూ చేరుకుంది. ర్యాలీలో రైతులు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలవంతంగా భూములు సేకరించవద్దని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
రైతుకు అండగా నిలుస్తాం..
బలవంతపు భూసేకరణను అడ్డుకుని రైతుకు అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక స్పష్టం చేశారు. రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తోందన్నారు. అసలు ప్రభుత్వం దేనికోసం భూసేకరణ చేస్తోందో కూడా చెప్పడం లేదన్నారు. పచ్చని పంటలు పండే రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందని, ఇది నిజంగా దుర్మార్గమైన చర్య అన్నారు. ఇలాంటి అరాచక పరిపాలన దేశంలో ఎక్కడా ఉండదన్నారు. అమరావతిలో రాజధాని పేరుతో భూములు లాక్కున్న కూటమి ప్రభుత్వం... ఇప్పుడు రాయలసీమలో పరిశ్రమలంటూ ఏపీఐఐసీని అడ్డం పెట్టుకొని రైతుల భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పొలాలు కోల్పోతే తమ కుటుంబాలు వీధిన పడతాయని రైతులు గగ్గోలు పెడుతున్నా...ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం నోరు విప్పడం లేదని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం హిందూపురం వాసుల దౌర్భాగ్యమన్నారు. వెంటనే ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు శ్రీకారం చుడతామని ఆమె హెచ్చరించారు.
రైతుల రోడ్డుపడేస్తారా..?
రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు చంద్రబాబు బలవంతంగా భూసేకరణ చేస్తున్నాడని రైతు సంఘం సీనియర్ నేత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రైతుల కడుపుకొట్టి జేబులు నింపుకోవడమేనా సంపద సృష్టా అని ప్రశ్నించారు. వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రైతులకు ఇన్సూరెన్స్‌లు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఎగ్గొట్టే క్రమంలో భాగంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నాడన్నారు. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, సీనియర్ నేత వేణురెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి అమానుల్లా, ఎంపీపీ రత్నమ్మ, చలివెందుల సర్పంచ్ ఉపేంద్రరెడ్డి, హిందూపురం రూరల్, చిలమత్తూరు, లేపాక్షి మండల కన్వీనర్లు రాము, రామకృష్ణారెడ్డి, సయ్యద్ నిస్సార్, ఎంపీటీసీ ధనుంజయరెడ్డి, లేపాక్షి వైస్ ఎంపీపీ అంజన్‌రెడ్డి, బీసీ సెల్, ఎస్సీ సెల్, మహిళా విభాగం, యూత్ వింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, సూర్యమోహన్, కవితారెడ్డి, మింటు మనోజ్, శబరీష్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా, నరసింహులు, కౌన్సిలర్లు రామచంద్ర, మహేష్‌గౌడ్, రోషన్ అలీ, నాయకులు శ్రీరాములు, పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భూసేక‘రణం’
టీఎన్ దీపిక ఆధ్వర్యంలో
హిందూపురంలో భారీ ర్యాలీ
కదం తొక్కిన రైతులు,
వైఎస్సార్ సీపీ నాయకులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మిన్నంటిన నినాదాలు
రైతులను ఇబ్బంది పెడితే
చూస్తూ ఊరుకోబోమన్న నేతలు
సర్కారు చర్యలను అడ్డుకోని ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపాటు

రైతన్న ధర్మాగ్రహం