
నేడు దివ్యాంగులకు పునఃపరిశీలన పరీక్షలు
ప్రశాంతి నిలయం: వికలాంగుల కోటాలో పింఛన్ పొందుతున్న వారికి శుక్రవారం పునఃపరిశీలన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గతంలో జరిగిన పునఃపరిశీలన పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నట్లు నిర్ధారణ కాగా, రీ అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తాజాగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మడకశిర, కదిరి, ధర్మవరం ఏరియా ఆస్పత్రుల్లో శారీరక వికలత్వ పరీక్షలు, హిందూపురం జిల్లా ఆస్పత్రిలో చూపు, వినికిడి, బుద్ధిమాంద్యం, మానసిక వికలత్వ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పునఃపరిశీలనకు జిల్లాలోని 5,207 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ నోటీసులు అందించామన్నారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాలని సూచించారు.