
సత్యసాయి రాకతో మారిన రూపురేఖలు..
పుట్టపర్తి అర్బన్: అది స్థానికుల పూర్వ జన్మ సుకృతమో.. లేక సత్యసాయి బాబా అవతార మహిమో తెలియదు కానీ.. ఓ పది ఇళ్లతో మొదలైన పుట్టపర్తి ప్రస్థానం నేడు ఖండాంతరాలకు వ్యాపించింది. ఒకప్పుడు కేవలం కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచిచూసిన జనానికి... నేడు గంటల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చే సదుపాయాలు సొంతమయ్యాయి. నాడు చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ స్థానికులను భయాందోళన గొలిపిన ప్రాంతం.. నేడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బాబా శత జయంతికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలిరానున్నారు.
కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి లా గొల్లలు అధికంగా ఉండే ఊరు గొల్లపల్లిగా అవతరించింది. గొల్లపల్లిలో అధిక శాతం యాదవులు నివసిస్తూ గోవులను పోషించేవారు. ఓ యజమానికి చెందిన ఆవు రోజూ మేతకు వెళ్లి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకుండా మొరాయించ సాగింది. దీంతో ఆవు దినచర్యపై యజమాని కన్నేశాడు. ఆవు మధ్యాహ్న సమయంలో ఓ పుట్ట వద్దకెళ్లి స్వతహాగా పాలు ఇవ్వడం గమనించిన యజమాని ఆగ్రహానికి లోనై పుట్టను పెకలించి, ఆందులోని పామును పెద్ద బండరాయితో కొట్టి గాయపరిచాడు. ఆ సమయంలో పాము చనిపోతూ గొల్లపల్లి మొత్తం పుట్టల మయమవుతుందని శపించిందనే కథనం వాడుకలో ఉంది. దీంతో గొల్లపల్లి వాసులు ఆందోళనకు గురై పరిహారం కింద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. అలా కాలానుగుణంగా గొల్లపల్లి కాస్త తొలుత పుట్టవర్ధిగా.. ఆ తర్వాత పుట్టపర్తిగా ప్రసిద్దికెక్కింది.
పంచాయతీ కేంద్రంగా 1964లో రికార్డుల్లోకి పుట్టపర్తి ఎక్కింది. 1980 నవంబర్‌లో పుట్టపర్తిని సత్యసాయి తాలూకాగా ఆవిష్కరించారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ సత్యసాయి తాలూకా ఏర్పాటైంది. ఆ సమయంలోనే తాలూకా చుట్టూ నాలుగు వైపులా ఆర్చీలు ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో భాగంగా పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో పుట్టపర్తి నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ (పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంగా రూపాంతరం చెందింది. 2022లో పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఆవిర్భవించింది.
బాబా శత జయంతికి ప్రపంచ
వ్యాప్తంగా తరలిరానున్న భక్తులు
62 ఏళ్లలో అనూహ్య పరిణామాలు
చిత్రావతి నది ఒడ్డున వెలసిన గొల్లపల్లిలో 1926 నవంబర్ 23న పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన బాలుడికి నత్యనారాయణగా నామకరణం చేసిన తల్లిదండ్రులు ఎంతో అల్లారుమద్దుగా పెంచుకునేవారు. 1940 అక్టోబర్‌లో ఆ బాలుడు తన అవతార ప్రకటన అనంతరం సత్యసాయిగా మారి ఎన్నో అద్భుతాలు చూపారు. 1948లో ప్రశాంతినిలయానికి శంకుస్థాపన చేసిన సత్యసాయిబాబా 1950 నవంబర్ 23 తేదీ నాటికి నిర్మించి ప్రారంభించారు. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేవారు. విద్యతోనే మానవ జీవనం సుఖమయమవుతుందని 1981 నవంబర్‌లో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చేతుల మీదుగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీని ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తూ 1984 ఫిబ్రవరిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టి 1991లో అన్ని రకాల వైద్య సేవలతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక మారుతున్న కాలానుగుణంగా 1990లో ఆర్టీసీ బస్‌స్టేషన్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయాన్ని నిర్మించారు. 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చే బృహత్ కార్యక్రమాన్ని 1995 జూలైలో ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. భక్తుల కోసం నిర్మించిన సాయికుల్వంత్ సభా మంటపాన్ని 1995 జూలైలో ప్రారంభించారు. ప్రేమ, శాంతి ధర్మం, సమత, మమత, సేవాతత్పరతకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి విరాజిల్లుతోంది.
నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి..
సమితి నుంచి జిల్లా కేంద్రం వరకూ..

సత్యసాయి రాకతో మారిన రూపురేఖలు..

సత్యసాయి రాకతో మారిన రూపురేఖలు..

సత్యసాయి రాకతో మారిన రూపురేఖలు..

సత్యసాయి రాకతో మారిన రూపురేఖలు..