‘సరిహద్దు’ను చక్కదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

‘సరిహద్దు’ను చక్కదిద్దుతాం

Oct 10 2025 6:20 AM | Updated on Oct 10 2025 6:20 AM

‘సరిహద్దు’ను చక్కదిద్దుతాం

‘సరిహద్దు’ను చక్కదిద్దుతాం

మడకశిర/అమరాపురం/రొళ్ల/గుడిబండ/అగళి/: ‘‘రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మట్కా, ఇతర గ్యాంబ్లింగ్‌ కూడా ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సరిహద్దును చక్కదిద్ది నేరాలు పూర్తిగా నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన మడకశిర అప్‌ గ్రేడ్‌, రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్లతో పాటు అమరాపురం, రొళ్ల, గుడిబండ, అగళి పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయా స్టేషన్‌లలో రికార్డులు, లాకప్‌ గదులు, కమాండ్‌ కంట్రోల్‌రూం, మహిళా హెల్ప్‌ డెస్క్‌, స్టేషన్ల పరిసరాలు, పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. పెండింగ్‌ కేసుల కేసుల గురించి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో దర్యాప్తు గురించి పోలీసులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. జాతీయ రహదారులపై లారీలు, ఇతర వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్‌ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దుల గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బంది సూచించారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అపరిచితుల వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

నో మట్కా.. నో గ్యాంబ్లింగ్‌

జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఆయా స్టేషన్ల తనిఖీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కదిరి, హిందూపురం పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో గంజాయి కార్యకలాపాల నియంత్రణకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒరిస్సా నుంచి హిందూపురం, కదిరి ప్రాంతాలకు గంజాయి కొంతమేర సరఫరా అవుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు గంజాయి విక్రేతలు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న మడకశిర నియోజకవర్గంలో ఎలాంటి నేరాలకు అవకాశం ఉంది... క్షేత్రస్థాయిలో వాటికి గల కారణాలను విశ్లేషించి, ఆయా నేరాలను అరికట్టడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జిల్లా కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానిస్తామన్నారు. దీనివల్ల నేరస్తులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. ఇక జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారం చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నేరస్తులతో చేతులు కలిపితే వేటు తప్పదు..

జిల్లాలో ఒకే స్టేషన్‌లో పాతుకుపోయిన హోంగార్డులందరినీ ఇప్పటికే బదిలీ చేశామని, త్వరలో ఆయా ప్రాంతాలకు కొత్త హోంగార్డులను పంపుతామన్నారు. ఇక నేరస్తులతో చేతులు కలిపే పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. వాహనాలు, ఇతరత్రా సమస్యలు ఉన్నప్పటికీ నేర రహిత జిల్లాగా మార్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. గంజాయి, మట్కా, పేకాట, అక్రమ మద్యం, నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎస్పీ వెంట పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప, సీఐలు నగేష్‌బాబు, రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ వీరేష్‌, ఏఎస్‌ఐలు శ్రీరాములు, బషీర, ఇదాయతుల్లా, పోలీసు సిబ్బంది ఉన్నారు.

అంతర్‌ రాష్ట్ర సరిహద్దులో

నేరాలను నియంత్రిస్తాం

నిరంతరం సీసీ కెమెరాలతో

పర్యవేక్షణ

గంజాయి రవాణా చేస్తే

కఠిన చర్యలు

పోలీసులు తప్పు చేస్తే

సస్పెన్షన్‌ వేటు తప్పదు

ఎస్పీ సతీష్‌కుమార్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement