
మా సొమ్ము చెల్లించండి మహాప్రభో!
హిందూపురం:. భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచిన సొమ్ము అత్యవసరానికి చేతికి అందడం లేదని, తమ సొమ్ము తమకు అందజేయాలంటూ తూముకుంట ఎస్‌బీఐ ఎదుట ఆ బ్యాంక్ ఖాతాదారులు గురువారం ఆందోళన చేపట్టారు. హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని ఎస్‌బీఐలో మూడు నెలల క్రితం భారీ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఖాతాదారులకు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పొదుపు చేసిన సొమ్ము, డిపాజిట్లను చెల్లిస్తామంటూ అప్పట్లో బ్యాంకు అధికారులు భరోసా ఇచ్చారు. ఖాతాదారులకు అవసరమైన సొమ్మును 15 రోజుల్లోపు చెల్లిస్తామని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం అగ్రిమెంట్లు రాయించుకుని కూడా నేటికీ సొమ్ము చెల్లించకపోవడంతో తూముకుంట కార్మిక సంఘం నాయకుడు రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బంగారు విలువ పెరుగుతూ ఉందని, తాము బ్యాంకులో దాచిన బంగారానికి ఎప్పటిదో పాత రేటు ఇస్తే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. బ్యాంకు వెళ్లిన ఖాతాదారుల పట్ల సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిడ్డల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి అగిపోయే పరిస్థితి ఉందని పలువురు అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎస్‌బీఐ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేకూర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తూముకుంట ఎస్‌బీఐ ఎదుట
ఖాతాదారుల ఆందోళన