
జీఎస్టీ సంస్కరణ ఫలాలు అందరికీ అందాలి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
● బుక్కపట్నంలో పలు షాపుల తనిఖీ
పుట్టపర్తి అర్బన్: జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతోనే ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన బుక్కపట్నం తేరు బజార్‌లోని పలు షాపులను సందర్శించారు. పలువురు స్థానికులకు జీఎస్టీ తగ్గింపు..తద్వారా వస్తువుల ధరల్లో వ్యత్యాసం గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జీఎస్టీలో స్లాబులు తగ్గించినందున ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్ నుంచి ఏసీ వరకూ రైతులు వినియోగించే ట్రాక్టర్, యువత కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాల వరకూ అన్ని రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. దీర్ఘ కాలిక వ్యాధులకు ఉపయోగించే ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి జీఎస్టీ లబ్ధిపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జీఎస్టీ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నరసింహులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జబ్బీర్ బాషా పాల్గొన్నారు.
చెరువుల్లో నీరు శాశ్వతంగా నిలిచేలా చర్యలు
ప్రశాంతి నిలయం: ఏడాదిలోపు జిల్లాలోని అన్ని చెరువులు, నీటి ట్యాంకుల్లోని నీరు శాశ్వతంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ట్యాంకుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారంపాండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో నీటి సంరక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాద్రి, ఏఈ షబానా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇన్‌చార్జ్ పీడీ శ్రీలక్ష్మి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎస్‌ఈ రాజా స్వరూప్ పాల్గొన్నారు.