
ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షలు
పుట్టపర్తి అర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసనలు, ధర్నాలు చేసినా స్పందించని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే సమ్మె బాట పట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు ఆమరణదీక్షలకు సిద్ధమయ్యారు. హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద వైద్యులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు రెండో రోజు బుధవారం కొనసాగాయి. వైద్యులకు ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ అసోషియేషన్ అధ్యక్షుడు జనార్దన్, జనరల్ సెక్రెటరీ మస్తాన్ వలి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కార్తిక్, ట్రెజరర్ జయతేజ నాయక్, ఈసీ మెంబర్ విజయ్‌భాస్కర్ తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం పలువురు వైద్యులు మాట్లాడుతూ...ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు విఫలమైతే ఈనెల 3వ తేదీ నుంచి విజయవాడ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న ఇన్‌సర్వీస్ ఫీజు చాలా తక్కువ అన్నారు. 20 ఏళ్లుగా పని చేస్తున్న వైద్యులకు సైతం ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కనీసం మరుగుదొడ్లు కూడా లేని చోట పగలంతా పని చేస్తున్నామన్నారు. తాము టైం బాండ్ ప్రమోషన్లు, చంద్రన్న సంచార చికిత్సలో రూ.5 వేలు భత్యం, ఇన్ సర్వీస్ పీజీ కోటా, నోషనల్ ఇంక్రిమెంట్లు, 50 శాతం మూల వేతనం, పని గంటలు, జాబ్ చార్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కష్ట పడ్డామని, తమ కష్టాన్ని అర్థం చేసుకుని తమ హక్కులను, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాగా బుధవారం నాటి సమ్మెలో డాక్టర్ షిఫా సుల్తానా తన పసిపాపతో పాల్గొనడం విశేషం.
స్పష్టం చేసిన ప్రాథమిక
ఆరోగ్యకేంద్రాల వైద్యులు
రెండోరోజూ కొనసాగిన
రిలేనిరాహార దీక్షలు

ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షలు