
కొత్త టీచర్లకు రేపటి నుంచి శిక్షణ
హిందూపురం టౌన్: డీఎస్సీ–25 ద్వారా కొత్తగా ఎంపికై న జిల్లాలోని టీచర్లకు రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 10 వరకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం హిందూపురంలోని బీఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని బుధవారం డీఈఓ కృష్ణప్ప పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదన్నారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు. నూతన ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు మెరుగు పడేలా శిక్షణ కొనసాగాలని శిక్షకులకు సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ మాలిక్, ఎంఈఓలు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, సీఆర్‌ఎంటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్‌లు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన
తనకల్లు: కనసానిపల్లి గ్రామస్తులు తాగునీటి సమస్యపై బుధవారం తనకల్లు పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిదెలతో నిరసన తెలిపారు. రెండు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్యాంక్‌ను నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో లోపల చెత్తాచెదారం పేరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్యాంక్‌కు అమర్చిన పైపులు మూసుకుపోవడంతో నీరు బయటకు రావడం లేదని తెలిపారు. ట్యాంక్‌ను శుభ్రం చేసి కుళాయిలకు సురక్షిత నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజారెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రమణారెడ్డి, ఎర్రంరెడ్డి, అనిత, లక్ష్మీదేవి, జయమ్మ, రాములమ్మ, శకుంతల, అనసూయమ్మ, రాములమ్మ, మల్లమ్మ, చౌడమ్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కొత్త టీచర్లకు రేపటి నుంచి శిక్షణ