
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారం మాటున అక్రమ రవాణా సాగిస్తోంది. అయినా మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల కళ్లెదుటే
పెద్దసంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి.
కొత్తచెరువు: అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు కొత్తచెరువులో మట్టిదందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తచెరువులోని మసీదు గుట్టను కొల్లగొడుతున్నారు. రోజూ 50 నుంచి 100 టిప్పర్ల పైనే మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.4వేల చొప్పున విక్రయిస్తుండగా రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ అక్రమంగా సంపాదిస్తున్నట్లు సమాచారం. అయినా ఏ పోలీసు అధికారి కానీ, మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడడంలేదు. బడా రాజకీయ నేతల కనుసన్నల్లోనే మట్టి దందా జరుగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ వెంచర్లు వేసినా, ఎక్కడ భూమి చదను చేయాలన్నా అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రమే మట్టి రవాణా చేస్తుండడం గమనార్హం.
రాత్రి సమయంలోనే అక్రమ రవాణా..
కొత్తచెరువులోని నాగిరెడ్డిపల్లి రోడ్డు సమీపంలో దాదాపు ఆరు ఎకరాల్లో మసీదు గుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టకు అనుకుని ఉన్న స్థానిక టీడీపీ నేత పట్టా భూమిని అడ్డుగా పెట్టి అక్రమ దందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలే మట్టి దందాను కొనసాగిస్తుండడంతో ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సైతం భయపడుతున్నారు. దీంతో మాఫియా మరింత రెచ్చిపోతోంది. సహజ వనరులను కరిగించేస్తోంది. గడిచిన వారం రోజులుగా గుట్టను పెకలించడంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్ట కాస్త నాలుగు ఎకరాలకు పరిమితమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మసీదు గుట్ట కాస్త మాయం అవడం ఖాయమని స్థానికులు అంటున్నారు.
కరిగిపోతున్న కొత్తచెరువు మసీదు గుట్ట
కొందరు టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ రవాణా
అనుమతులు లేకుండా తవ్వకాలు
చర్యలు తప్పవు
గత సోమవారం అందిన సమాచారం మేరకు రాత్రి తనిఖీ చేపట్టి మట్టి తవ్వకాలను అడ్డుకున్నాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు చేపట్టరాదు. సొంత పట్టా భూమిలో మట్టి తవ్వాలన్నా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే ఎంతటివారినైనా ఉపేక్షించబోం. మసీదు గుట్టలో సాగుతున్న అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– బాలాంజనేయులు, తహసీల్దార్, కొత్తచెరువు