
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
అనంతపురం సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకు సాగుతోందని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ (జీఎం) షేక్ ముజీబ్‌పాషా పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన కాలానుగునంగా ప్రైవేటు సంస్థలకు దీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ లోనూ అనేక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా దూసుకుపోతోందని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్లు 13,208 ఉండగా, ఓఎల్‌టీఎస్ 189 కనెక్షన్లు ఉన్నాయన్నారు. 2జీ/4జీ టవర్లు 343 ఉండగా, 2,79,591 మంది ప్రీపెయిడ్ వినియోగదారులు ఉన్నారన్నారు. 2,679 మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు, 790 ఐఎల్‌ఎల్ కనెక్షన్లను కలిగి ఉన్నామన్నారు. సమష్టి కృషితోనే తమ సంస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే ఏడాదిలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలు, స్కీముల అమలు కారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీజీఎం బాలగంగాధర్‌రెడ్డి, ఏజీఎం బాలాజీ, ఎస్‌డీఈలు రేవతి, హేమంత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, జేటీఓలు మాళవిక తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఉమ్మడి జిల్లా
జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్‌పాషా
అనంత వేదికగా అట్టహాసంగా
సిల్వర్ జూబ్లీ వేడుకలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు