
మా బాధలు పట్టించుకోరా?
ఓ సంఘం నాయకులపై
తిరగబడ్డ ఎంటీఎస్ టీచర్లు
కాగా ఓ సంఘం నాయకులు అక్కడికి చేరుకుని అధికారుల మెప్పు పొందేందుకు ఎంటీఎస్ టీచర్లను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ‘మీ పోస్టులు చట్టబద్ధం కావు. అనవసరంగా ఇబ్బంది పడతారు. మీరడుగుతున్నట్లు అన్ని ఖాళీలు చూపించడం వీలుకాదు. సజావుగా కౌన్సెలింగ్ జరిగేందుకు సహకరించండి’ అంటూ మాట్లాడగా అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న వారు తిరగబడ్డారు. మా బాధలు అర్థం కావడం లేదా.. అని మండిపడ్డారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, వయసుపైబడి రిటైర్‌మెంట్‌కు చాలామంది దగ్గరలో ఉన్నారని అలాంటి వారు ఎలా వెళ్తారో తెలీదా అని నిలదీయడంతో ఆ సంఘం నాయకులు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: తమబాధలు పట్టించుకోవడం ప్రభుత్వం పొమ్మనలేక పొగ పెడుతోందంటూ ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 594 మంది ఎంటీఎస్ టీచర్లు పని చేస్తున్నారు. 693 ఖాళీలు చూపించారు. వీటిలో 80 శాతం దాకా జిల్లా సరిహద్దు (కర్ణాటక రాష్ట్రం బార్డరు) మండలాల్లోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకే జిల్లా సైన్స్ సెంటర్‌కు బదిలీల కౌన్సెలింగ్ కోసం ఎంటీఎస్ టీచర్లు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఖాళీల సమాచారం తెలుసుకున్న ఎంటీఎస్ టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. మెజార్టీ ఖాళీలు గుడిబండ, డి.హీరేహాల్, అమరాపురం, అగళి, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రం, కంబదూరు, రాయదుర్గం, శెట్టూరు, కణేకల్లు మండలాల్లో చూపించారని వాపోయారు. తక్కిన మండలాల్లో 1,2,3 పోస్టులు మాత్రమే చూపించారన్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్‌ఆర్‌ఏ సౌలభ్యం కూడా ఉండదని, అలాంటి తమను అంతంత దూరం వంపితే ఎలా అని వాపోయారు. దీనికితోడు చాలామంది రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం తమకు ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులిస్తే...ఈ ప్రభుత్వం ‘లాంగ్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు ఇస్తోందంటూ మండిపడ్డారు.
డీఈఓను అడ్డుకుని నిరసన
కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన డీఈఓ ప్రసాద్‌బాబును ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలతో పాటు ఏకోపాధ్యాయుడు ఉండే స్కూళ్లను ఖాళీగా చూపించాలని పట్టుబట్టారు. ఆందోళన చేస్తున్న విషయాన్ని డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. వారి నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఆమేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అయితే, రాత్రి 7 గంటల సమయానికి కూడా స్పష్టత రాకపోవడంతో బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి ఎంటీఎస్ టీచర్లు వెళ్లిపోయారు. ఎంటీఎస్ టీచర్లకు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, గోపాల్, వెంకటరమణ, ఏపీటీఎఫ్ నాయకులు వెంకటేష్, సిరాజుద్దీన్, నరసింహులు, నాగరాజు, తదితరులు మద్దతు తెలిపారు.
బదిలీల ఖాళీలపై ఎంటీఎస్ టీచర్ల రగడ
80 శాతానికి పైగా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఉన్నాయంటూ ఆవేదన
సైన్స్ సెంటర్‌లో కౌన్సెలింగ్
అడ్డగింత.. బాయ్‌కాట్

మా బాధలు పట్టించుకోరా?