
మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని యువతకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా దినం సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి గణేష్ కూడలి వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతం మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని హెచ్చరించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పెడదారిన పడి జీవితాలు నాశనం చేసుకోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ఎక్‌పైజ్ శాఖ అధికారి నాగముద్దయ్య, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.