
పంచాయతీకే పంగనామం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఇది రామగిరి... ఇక్కడ మేం ఏమైనా చేయగలం... అందినకాడికి దోచుకుంటాం ... లేదంటే లాక్కుంటాం.. అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలమైన రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బాగోతం బయటపడింది. పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ను గత సంవత్సర కాలంగా సొంత పనులకు వాడుకోవడమే కాదు రోజూ చుట్టు పక్కన ఉన్న గ్రామాల రైతులకు బాడుగలకు పంపుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అంతేకాదు ఏకంగా ట్రాలీని సమీపంలోని కర్ణాటక ప్రాంతంలోని సోలార్‌కు లీజ్‌కు ఇచ్చాడంటే ఎంత ఘనుడో అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోని అధికారులు..
గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. అలాగే పంచాయతీ అభివృద్ధికి చెత్త తరలింపునకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆయా ట్రాక్టర్లను టీడీపీ నాయకులు తమ ఆధీనంలో ఉంచుకొని సొంత పనులకు వాడుకుంటుండటం గమనార్హం. పేరూరులోనే కాదు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇదే రీతిలో ట్రాక్టర్లను సొంతానికి వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీరాజ్‌శాఖకు చెందిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికై నా డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పవన్‌కల్యాణ్ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పంచాయతీల్లో ట్రాక్టర్లను వెనక్కు తీసుకొని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పేరూరు పంచాయతీలో
టీడీపీ మండల కన్వీనర్ దౌర్జన్యం
ఏడాదిగా చెత్త తరలించే ట్రాక్టర్‌ను బాడుగకు పంపుతున్న వైనం
మిగతా చోట్లా ఇదే రీతిలో
దోచుకుంటున్నారన్న విమర్శలు