
పిల్లలూ.. భోజనం బాగుందా?
● విద్యార్థులను ఆరా తీసిన
జాయింట్ కలెక్టర్
పుట్టపర్తి: పిల్లలూ మధ్యాహ్న భోజనం బాగుందా... సన్నబియ్యంతోనే అన్నం వండుతున్నారా.. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా... అంటూ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ విద్యార్థులను ఆరా తీశారు. మంగళవారం ఆయన పుట్టపర్తి శివాలయం వీధిలోని ప్రాథమిక పాఠశాలను, చిన్నపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం ప్రభుత్వం పాఠశాలలకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని తెలిపారు. జేసీ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి, తహసీల్దార్ కళ్యాణ్, డీటీ రమేశ్, ఎంఈఓలు ఖాదర్ వలి బాష ,ప్రసాద్, హెచ్‌ఎంలు వెంకటనారాయణ, రజనీకాంత్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.
ఆకతాయికి దేహశుద్ధి
సోమందేపల్లి: మండల కేంద్రంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిని పట్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం రోజులాగే కొందరు మహిళలు వాకింగ్ చేస్తుండగా వైఎస్సార్ సర్కిల్ వద్ద కర్ణాటకలోని చిక్కబళాపురానికి చెందిన వాహన డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళలు పట్టుకుని దేహశుద్ది చేస్తుండడంతో స్థానికులు చుట్టుముట్టి లాక్కెళ్లి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖైదీ కోసం కదిరి పోలీసుల గాలింపు
కదిరి టౌన్: తెలంగాణలోని నిజామాబాదు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ కోసం కదిరి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు జీవన్ అనే ఖైదీ నిజామాబాదు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైలు పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో పనిచేసే అతను గత నెల 29న సెంట్రీ గార్డుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. అదే నెల 30న కదిరి బస్టాండ్‌కి చేరుకున్నట్లుగా గుర్తించిన అక్కడి పోలీసుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్టాండ్‌కు పోలీసులు చేరుకునేలోపు అక్కడి నుంచి జీవన్ పారిపోయాడు. కదిరి పట్టణం లేదా చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చామన ఛాయ రంగు కలిగి, గుండు చేయించుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 94407 96851, 77026 42541, 99127 78069, 87125 32885కు సమాచారం అందించాలని సీఐ వి.నారాయణరెడ్డి కోరారు.

పిల్లలూ.. భోజనం బాగుందా?