
స్కూల్ బస్సుల కండీషన్‌పై ప్రత్యేక దృష్టి
అనంతపురం సెంట్రల్: విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సుల కండీషన్‌పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. స్కూల్ బస్సుల కండీషన్ అంశంపై రవాణాశాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆర్టీఓ సురేష్‌నాయుడుతో కలసి జిల్లాలోని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో 600 పై చిలుకు స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ బస్సులన్నీ కండీషన్‌లో ఉన్నాయో? లేదో పరిశీలించాని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధిక లోడు, ప్యాసింజర్లతో వెళ్లే గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు.
నగర శివారున వాహనాల ఛేజింగ్
నగర శివారున వాహనాల ఛేజింగ్ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారిని బెంబేలెత్తించింది. వివరాలు... జిల్లా రవాణా శాఖకు చెందిన ఏఎంవీఐ కేవీఎల్‌ఎన్ ప్రసాద్ మంగళవారం నగరంలోని టీవీ టవర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన రెండు బొలెరో వాహనాల నిండా చేపల వలలు, ఆపై బోట్లు (పుట్టి) వేసుకుని వాటిపై మనుషులు కూర్చొని ప్రయాణిస్తుండడం గమనించిన ఆయన వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బొలెరో డ్రైవర్లు ఆపకుండా శరవేగంతో దూసుకెళ్లి పోవడంతో ఏఎంవీఐ తన వాహనంలో వెంబడిస్తూ రాప్తాడు పంగల్ రోడ్డు దాటిన తర్వాత అడ్డుకున్నారు. వాహనాలను ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. విచారణలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వాహనాలకు పర్మిట్‌లు, ట్యాక్స్‌లు లేకపోవడం, ప్రమాదకరంగా ప్రజలను తీసుకెళుతుండడంతో కేసు నమోదు చేసి జరిమానా విధించారు.