
యువకుడి ప్రాణాలు బలిగొన్న మీటర్ వడ్డీ
పావగడ: మీటర్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పావగడ తాలూకా వైఎన్ హొసకోట పీఎస్ పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన వైటీ మంజునాథ్ (38)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఈ క్రమంలో పంట దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డాడు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు ఒత్తిళ్లు చేస్తూ సాధారణ వడ్డీని కాస్త మీటర్ వడ్డీ కిందకు మార్చుకున్నారు. వడ్డీల కిందనే రూ.లక్షల్లో చెల్లించినా అప్పులు తీరలేదు. వడ్డీలకు వడ్డీలు పెరుగుతూ రూ.15 లక్షలకు పైగా చేరుకుంది. ఈ భారం నుంచి బయటపడేందుకు గ్రామంలో తనకు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఇందుకు గాను వారానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ వడ్డీలు చెల్లించే దుస్థితికి వడ్డీ వ్యాపారులు తీసుకెళ్లారు. నానాటికీ వడ్డీల భారం పెరగడం, అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన మంజునాథ్ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వైఎన్ హొసకోట పీఎస్ ఎస్‌ఐ మాళప్ప నాయక్కుడి తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వజ్ర భాస్కరరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కె.వజ్ర భాస్కర రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్ యాక్టివిటీ)గా నియమించారు. ఈ మేరకు మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి టౌన్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం అన్నారు. జాతీయ డెంగీ మాసోత్సవాల పోస్టర్లు, బ్యానర్లను అధికారులతో కలసి తన కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని అన్ని గ్రామాల్లోనూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు నెల రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
చిరుత దాడి.. గాడిద పిల్ల మృతి
వజ్రకరూరు: మండలంలోని కడమలకుంట గ్రామ పరిసరాల్లో చిరుత దాడిలో ఓ గాడిద పిల్ల మృతి చెందింది. యజమాని చాకలి వెంకటేష్ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం ఫారెస్ట్ బీట్ ధికారి సతీష్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, ప్లాట్ వాచర్ మల్లికార్జున తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుత సంచారాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.
రైలులో ప్రయాణికుడి మృతి
గుంతకల్లు: ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్వివాంగుల బోగీలో ప్రయాణిస్తున్న అతని వద్ద కనీసం టికెట్ కూడా లేదు. సరైన సంరక్షణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడమే మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. ఎరుపు రంగులో ఉండి.. కాఫీ కలర్ టీ షర్టు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
కుక్కపై చిరుత దాడి
అగళి: మండలంలోని కురసంగనపల్లి శివారున రైతు రంగరాజు పొలంలో మంగళవారం వేకువజామున కుక్కపై చిరుత దాడి, సగానికి పైగా తినేసింది. అలాగే గిరయప్పకు చెందిన జీవాల మందపై దాడి చేసి నాలుగు గొర్రెలను హతమార్చింది. కాగా, అగళి మండలం గాయత్రీ కాలనీ, పి.బ్యాడిగెరే, కరిదాసన్నపల్లి గ్రామాల్లో చిరుత సంచరిస్తూ గొర్రెలు, మేకలు, ఆవులు, తదితర వాటిపై దాడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళలో పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరారు.

యువకుడి ప్రాణాలు బలిగొన్న మీటర్ వడ్డీ

యువకుడి ప్రాణాలు బలిగొన్న మీటర్ వడ్డీ