
పెండింగ్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ పనులు వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి ఎన్‌హెచ్ –342, ఎన్‌హెచ్ 716జీ, ఎన్‌హెచ్–455జీ రహదారుల భూసేకరణకు సంబంధించిన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. రహదారి సౌకర్యం మెరుగైతే రవాణాకు ఇబ్బందులు ఉండవని, తద్వారా జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం జిల్లా మీదగా వివిధ రహదారులు నిర్మిస్తోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో అటవీ, పర్యావరణ, కోర్టు సంబంధిత అంశాలు, అభ్యంతరాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులను ఆర్డీఓలు మరోసారి పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. అనంతరం ఎన్‌హెచ్–342కి సంబంధించి బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద భూసేకరణ, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం వద్ద భూసేకరణ బిల్లుల పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల గోడ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సుబ్బయ్య, ఎన్‌హెచ్ ఏఐ పీడీ అశోక్ కుమార్, మేనేజర్ ముత్యాల రావు, డీఈ గిడ్డయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, ఏఈటీ కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులను త్వరగా
అందుబాటులోకి తేవాలి
అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం