ప్రజా ప్రదక్షిణ వేదిక | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రదక్షిణ వేదిక

Jul 1 2025 4:34 AM | Updated on Jul 1 2025 4:34 AM

ప్రజా

ప్రజా ప్రదక్షిణ వేదిక

10,187

తన ఇంటిని ఇతరులు బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని హిందూపురం డీబీ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఇప్పటి వరకు 14 సార్లు అర్జీలిచ్చారు. అయినా కనీస స్పందన లేదు. దీంతో జిల్లా రిజిస్ట్రార్‌కు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా.. ఖర్చులు తప్ప ఉపయోగం లేదని బాధితుడు వాపోయాడు. పాలకులు, అధికారుల తీరుపై నమ్మకం పోయిందంటున్నాడు.

రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్లుగా కర్ణాటకలో నివాసం ఉంటోంది. వారి భూమిని మూడు సర్వే నంబర్లలో కలిపి 5 ఎకరాలను పేరూరు గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో తమ పేరుపై ఎక్కించుకున్నారు. ఇటీవల ఆన్‌లైన్‌లో వన్‌–బీ చూడగా.. ఆ ఖాతా నంబరుపై మరొకరి పేరు వస్తుండటంతో బాధితులు మండల, డివిజన్‌ స్థాయిలో అర్జీలిచ్చారు. ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్‌కు వెళ్లి వరుసగా మూడు వారాలు అర్జీలిచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు.

సాక్షి, పుట్టపర్తి

‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే చాలా... ఎంతటి సమస్యనైనా అధికారులే మీ వద్దకు వచ్చి పరిష్కరిస్తారు’’ అంటూ పాలకులు గొప్పలు చెబుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేస్తే.. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా సీఎంఓ కు చేరుతుందని, గంటల వ్యవధిలోనే స్పందన వస్తుందంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిజమే అనుకున్న జనం కలెక్టరేట్‌ వరకూ తమ సమస్యపై అర్జీ ఇస్తే అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. దీంతో జనం ఒకే సమస్యపై పదేపదే అర్జీలిస్తున్నారు. అయినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. పైగా సమస్య పరిష్కారమైనట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తుండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ సమస్యలే అధికం..

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రతి సోమవారం వివిధ సమస్యలపై ప్రజల నుంచి సగటున 500 వరకు అర్జీలు అందుతుంటాయి. అందులో 400 వరకు (80 శాతం) రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. సాగులో ఒకరుంటే.. ఆన్‌లైన్‌లో మరొకరి పేరు ఉంటోంది. భూమి ఒకరి పేరు మీద ఉంటే.. ఇద్దరి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులే భూ కబ్జాలకు పాల్పడుతుండటంతో ఏడాది వ్యవధిలోనే భూ తగాదాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో జనం మండల, డివిజన్‌ స్థాయి తొలుత ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలిస్తున్నారు. అయితే కలెక్టరేట్‌లో ఇచ్చిన అర్జీని మళ్లీ డివిజన్‌ లేదా మండల అధికారులకే పంపుతుండటంతో సమస్యల పరిష్కారం అటకెక్కుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పని ప్రదక్షిణ..

జిల్లాలో 32 మండలాలుండగా.. తనకల్లు, నల్లచెరువు, అమడగూరు, అమరాపురం, రొళ్ల, గుడిబండ, అగళి, రామగిరి, కనగానపల్లి, పరిగి మండలాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంటాయి. ఓసారి వచ్చి వెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఒకరోజు పనులు మానుకోవాల్సిందే. దీంతో ఆయా మండలాల వారు తమ సమస్యలపై తొలుత స్థానిక మండల, డివిజన్‌ స్థాయిలోనే ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ పరిష్కారం కాకపోవడంతో వ్యయ, ప్రయాసల కోర్చి పుట్టపర్తిలోని కలెక్టరేట్‌ వరకూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

పరిష్కార వేదికకు

అందిన అర్జీలు

(వివరాలన్నీ జనవరి 1 నుంచి

జూన్‌ 30 వరకు )

5,934

2,313

తూతూ మంత్రంగా

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

అర్జీలన్నీ బుట్టదాఖలు..

పరిష్కారమైనట్లు మెసేజ్‌లు

ప్రతి వారం కలెక్టరేట్‌కు వచ్చి

అర్జీ ఇచ్చినా ఫలితం శూన్యం

కూటమి సర్కారు తీరుపై జనం లబోదిబో

7,302

2,885

ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు..

నా వ్యవసాయ మోటర్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ.1.40 లక్షలు చెల్లించాను. ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు మెటీరియల్‌ ఇవ్వలేదు. కేవలం స్తంభాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాతో డబ్బులు తీసుకున్న ఏఈ బదిలీపై వెళ్లారు. కొత్తగా వచ్చిన వాళ్లేమో.. మాకు తెలీదంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌లో ఎనిమిది సార్లు అర్జీలిచ్చినా పట్టించుకున్న వారే లేరు.

– రాజా, కొండకమర్ల, ఓడీ చెరువు మండలం

నడవలేని స్థితిలోనూ..

వస్తూనే ఉన్నా

నా భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. పట్టా పాసు పుస్తకాలు చేయించుకుని నన్ను రానివ్వడం లేదు. ఇప్పటికే ఆరుసార్లు కలెక్టరేట్‌లో అర్జీలిచ్చిన.. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అంతకుముందు తనకల్లు తహసీల్దార్‌, కదిరి ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేశాను. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నడవలేని స్థితిలో పలుమార్లు కలెక్టరేట్‌కు వస్తున్నా.. నా భూమిని నాకు అప్పజెప్పలేకపోతున్నారు. పరిష్కరిస్తామని చెబుతుండటంతో ఆశతో వస్తున్నా. – కొండప్పనాయక్‌,

మల్లిరెడ్డిపల్లి, తనకల్లు మండలం

అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి

అధికారులకు కలెక్టర్‌ చేతన్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అందే అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 266 అర్జీలు అందగా..వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్తే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామ సుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉన్నత విద్య అభ్యసిస్తున్న 8 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సమకూర్చిన ల్యాప్‌టాప్‌లను కలెక్టర్‌ పంపిణీ చేశారు.

ప్రజా ప్రదక్షిణ వేదిక 1
1/4

ప్రజా ప్రదక్షిణ వేదిక

ప్రజా ప్రదక్షిణ వేదిక 2
2/4

ప్రజా ప్రదక్షిణ వేదిక

ప్రజా ప్రదక్షిణ వేదిక 3
3/4

ప్రజా ప్రదక్షిణ వేదిక

ప్రజా ప్రదక్షిణ వేదిక 4
4/4

ప్రజా ప్రదక్షిణ వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement