
‘మోడల్’ సీట్లు అమ్ముకుంటున్నారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కనగానపల్లి మోడల్ స్కూల్ ప్రవేశాల వ్యవహారం చర్చనీయాంశమైంది. సాక్షాత్తు ఆ పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు నియోజకవర్గంలో దుమారం రేపుతోంది.
ఏం జరిగిందంటే...
కనగానపల్లి మోడల్ స్కూల్‌లో 6 నుంచి ఇంటర్ వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతికి 40 సీట్లు ఉంటాయి. వసతి గృహంలో మాత్రం 100 సీట్లే అందుబాటులో ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కౌన్సెలింగ్ ద్వారా పలువురికి ప్రవేశాలు కల్పించారు. తాజాగా సోమవారం మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య పాఠశాల వద్దకు వెళ్లి అర్హులైన విద్యార్థినులకు సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు లేవని చెప్పడంతో అతను కంగుతిన్నాడు. మిగులుసీట్లు ఎవరికిచ్చారు..ఎలా ఇచ్చారని ప్రశ్నించగా..ప్రిన్సిపాల్ సమాధానం చెప్పలేదు. కాగా, డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించడంతో పోతలయ్య వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి కనగానపల్లి మోడల్ స్కూల్‌లో జరిగిన అడ్మిషన్ల కుంభకోణాన్ని పరిటాల సునీతకు వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు అమ్ముకుంటూ అర్హులైన పేద విద్యార్థినులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దీనిపై వెంటనే స్పందించి ప్రిన్సిపాల్‌పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్టు సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది.
ఆవేదన వ్యక్తం చేస్తూ కనగానపల్లి మోడల్ పాఠశాల వైస్ చైర్మన్ సోషల్ మీడియాలో పోస్ట్