
అత్యాచారాలు.. దోపిడీలు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, చోరీలు పెచ్చుమీరిపోతున్నాయి. రోజుకో చోట ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. ఏడాదిగా నియోజకవర్గంలో రోజూ ఏదో ఒక ఘటన జరుగుతున్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే పోలీసు యంత్రాంగం ముందస్తుగా నేరాలను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అత్తాకోడలిపై అత్యాచారంతో మొదలు..
కూటమి సర్కార్ కొలువుదీరాక హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తోంది. పోలీసులు ఎవరినైనా పట్టుకున్నా.. వెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ వస్తోంది. దీంతో పోలీసులు తమకెందుకని భావించి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఏడాది కాలంలో హిందూపురంలో అకృత్యాలు, దౌర్జన్యాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
● చిలమత్తూరు మండలంలో గతేడాది అక్టోబరులో కొందరు దుండగులు అత్తాకోడలిపై అత్యాచారం చేయడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అప్పుడు ప్రారంభమైన నేరాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న చౌళూరులో అత్యాచార యత్నం, నేడు తూముకుంటలో హత్య, కిరికెరలో భారీ దోపిడీ..ఇలా ఏడాదిగా హిందూపురం..నేరస్తుల పరమైంది.
● చిలమత్తూరు మండలంలోని కందుర్పర్తి, చౌళూరు గ్రామాల్లో బాలికలపై జరిగిన అత్యాచార యత్నాలు కూడా కూటమి సర్కార్ హయాంలో చోటుచేసుకున్నవే.
● 2024 జూలైలో హిందూపురం మండలంలోని గొల్లాపురంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సతీష్‌ను టీడీపీ నేతలు దారుణంగా కొట్టి చంపారు. నిందితులను రిమాండ్‌కు పంపి పోలీసులు చేతులు దులుపుకోవడంతో వారు బెయిల్‌పై బయటకు వచ్చి బాధితులను బెదిరిస్తున్నారు. పైగా తమకు ఎవరు అడ్డుచెప్పినా అంతం చేస్తామంటూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు.
● తాజాగా ఈనెల 26వ తేదీన లేపాక్షి మండలం మైదుగోళంలో రవికుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గంగోత్రి బార్ వద్ద ఆటోడ్రైవర్ అశోక్‌తో జరిగిన గొడవలో అతను మృత్యువాత పడ్డాడు. ఇక పేకాట, అక్రమ మద్యం, మట్కాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పోలీసుశాఖలోని కొందరి అండతోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పెరిగిపోయిన దోపిడీలు, దొంగతనాలు
● హిందూపురం రూరల్ మండలంలోని కిరికెర గ్రామం వెంకటాద్రి లేఅవుట్‌లో ఈనెల 26వ తేదీ రాత్రి నిత్యానందరెడ్డి ఇంట్లో జరిగిన భారీ దోపిడీ నియోజకవర్గంలో జరిగిన మరో సంచలనం. దుండగులు తుపాకులతో బెదిరించి మరీ 25 తులాల బంగారు నగలను దోపిడీ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాద్రి లేఅవుట్‌లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటన పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ఎనిమిది బృందాలు రంగంలోకి దిగినా.. ఇంత వరకూ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
● మరవకొత్తపల్లి బీసీ కాలనీలోనూ పట్టపగలే దుండగులు చోరీ చేసి బంగారం ఎత్తుకెళ్లారు. డ్రోన్‌లతో నిఘా పెంచుతామని ప్రకటించుకున్న పోలీసులు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు. సీసీ కెమెరాల ఏర్పాటులోనూ అలసత్వం కనిపిస్తోంది. చిలమత్తూరు మండలంలో గతేడాదిగా కొడికొండ చెక్‌పోస్ట్‌తో పాటుగా మండలంలోని పలు చోట్ల బైక్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు కూడా జరిగాయి. అయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు.
పట్టించుకోని ఎమ్మెల్యే బాలకృష్ణ
సినీనటుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఎప్పుడో చుట్టం చూపుగా హిందూపురం వచ్చి వెళ్తుంటారు. పాలన అంతా పీఏల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దీంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ముఖ్యంగా పోలీసు శాఖ అధ్వాన్నంగా తయారైందని స్థానికులే చెబుతున్నారు. డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు ఉన్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.
హిందూపురంలో అదుపుతప్పిన
శాంతిభద్రతలు
ఏడాది కాలంలోనే పెచ్చుమీరిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు
డీఎస్పీతో పాటు నలుగురు
సీఐలున్నా ప్రయోజనం శూన్యం
భయాందోళనలో
నియోజకవర్గ ప్రజానీకం

అత్యాచారాలు.. దోపిడీలు

అత్యాచారాలు.. దోపిడీలు

అత్యాచారాలు.. దోపిడీలు