
సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన.. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్‌ఎస్, హౌసింగ్, పౌర సరఫరాలు, నీటి పన్నులు తదితర అంశాలపై ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా సర్వే అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలన్నింటికీ సరైన పరిష్కారం చూపాలన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై నెలాఖరులోపు రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఎల్‌ఎస్ గోడౌన్లను తనిఖీ చేయాలన్నారు.
పురుగు మందు ప్రభావంతో రైతు మృతి
చెన్నేకొత్తపల్లి: పొలంలో పురుగుల మందు పిచికారీ చేసి ఇంటికి వచ్చిన రైతు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలోని న్యామద్దల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (53) మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పంటకు రసాయన మందు పిచికారీ చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ప్రైవేటు వాహనంలో చికిత్స నిమిత్తం చెన్నేకొత్తపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య వరలక్ష్మితో పాటు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కాగా, పంటలకు రసాయన ఎరువులు పిచికారీ చేసే సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
గూగూడులో
కొలువు తీరిన పీర్లు
నార్పల: మండల పరిధిలోని గూగూడు మోహర్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో పీర్లు కొలువు తీరాయి. ఈ సందర్భంగా ఆలయంలో కుళ్లాయి స్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకున్నారు. అగ్ని గుండం వద్ద భక్తిశ్రద్ధలు పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం కుళ్లాయి స్వామికి నిత్య పూజ నివేదన నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.

సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ చూపాలి