రైళ్లల్లో కొరవడిన భద్రత | - | Sakshi
Sakshi News home page

రైళ్లల్లో కొరవడిన భద్రత

Jun 27 2025 6:31 AM | Updated on Jun 27 2025 6:31 AM

రైళ్లల్లో కొరవడిన భద్రత

రైళ్లల్లో కొరవడిన భద్రత

గుంతకల్లు: రైలు ప్రయాణమంటనే ప్రయాణికులు హడలెత్తిపోయే రోజులు వచ్చాయి. ముఖ్యంగా దుండగులు ఆర్ధరాత్రి సమయాల్లో సిగ్నల్‌ కోసం వేచి చూస్తూ రైల్వేస్టేషన్‌ ఔటర్‌ ప్రాంతాల్లో నిలిపిన రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెరలేపడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్న రైల్వే ఎస్కార్ట్‌, నిఘా వ్యవస్థలు నిద్రావస్థలో ఉండిపోయాయి. రైళ్లల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఏసీ బోగీల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన రైళ్లలో జరిగిన చోరీలు..

● ఈ ఏడాది ఏప్రిల్‌ 29న నిజాముద్దీన్‌–తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు గుత్తి జంక్షన్‌ సమీపంలో ఔటర్‌లో సిగ్నిల్‌ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ముందస్తు పథకం ప్రకారం దాదాపు నాలుగు స్లీపర్‌ బోగీల్లోకి చొరబడి మారణాయుధలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించారు.

● మూడేళ్ల కిత్రం వరురసగా హంపి, రాయలసీమ, చైన్నె ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అదే ఔటర్‌లో సిగ్నల్‌ కోసం నిలిపిన సమయంలో దుండగులు చొరబడి దాదాపు 30 తులాలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు.

● గుత్తి–అనంతపురం రైలు మార్గంలోని తురకపల్లి రైల్వేస్టేషన్‌, గుత్తి–తాడిపత్రి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ వైర్లును కట్‌ చేయడంతో రైలు ముందుకు పోవడానికి అవకాశం లేకుండా చేసి, ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణలు ఎత్తుకెళ్లారు.

● తాజాగా (గడిచిన సోమవారం వేకువజాము) తాడిపత్రి రైల్వేస్టేషన్‌ ఔటర్‌లో సిగ్నల్‌ వైర్లను కట్‌ చేసి కోమలి రైల్వేస్టేషన్‌ ఔటర్‌లో నిలిచిన ముంబై–చైన్నె ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణికురాలు విశాలక్ష్మి మెడలోని 2.7 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు.

అదే రోజు రాత్రి పాండిచ్చేరి–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణికురాలు దివ్వభారతి మెడలోని 3.5 తులాల బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. గుత్తి రైల్వేస్టేషన్‌లో ఆగిన రైలు కిటికి వద్ద కూర్చొన్న ఓ ప్రయాణికుడి చేతిలోని ఖరీదైన సెల్‌ఫోన్‌ను అపహరించారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధి 12 జిల్లాలకు విస్తరించి ఉంది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీలతోపాటు కర్ణాటకలోని రాయచూర్‌, బళ్లారి జిల్లాలకూ గుంతకల్లు రైల్వే పోలీస్‌ కేంద్రంగా ఉంది. గుంతకల్లు డివిజన్‌ వ్యాప్తంగా 900 మంది పోలీసులు అవసరం కాగా, ప్రసుత్తం 550 మంది మాత్రమే ఉన్నారు. 350కి పైగా ఖాళీలు ఉన్నాయి. డివిజన్‌ వ్యాప్తంగా రోజూ 300కు పైగా ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గుంతకల్లు, గుత్తి రైల్వేజంక్షన్ల మీదుగా రాత్రి పూట దాదాపు 50కి పైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తిరుగాడుతున్నాయి. ఈ రైళ్లకు 20 నుంచి 24 బోగీలు ఉంటాయి. రాత్రి పూట తిరిగే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఎస్కార్ట్‌గా కేటాయిస్తున్నారు. స్టాఫ్‌ తక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందితోనే 24 గంటలు విధులు నిర్వహిస్తుండటంతో విశ్రాంతి లేక జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌లు ఒత్తిడికి లోనువుతున్నారు.

ప్రయాణికుల రక్షణే ధ్యేయం

ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఉన్న కొద్ది పాటి సిబ్బందితో ర్యాండమ్‌గా రైళ్లలో బందోబస్తు చేపడుతున్నాం. జీఆర్‌పీ సిబ్బంది ఇద్దరితో పాటు ఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌కు రైళ్లలో ఎస్కార్టు విధులు కేటాయిస్తున్నాం. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తున్నాం.

– హర్షిత, జీఆర్పీ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ, గుంతకల్లు

రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

ప్రయాణికుల సొమ్ముకు రక్షణ కరువు

నిద్రావస్థలో రైల్వే పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement