‘మురుగు’నూ వదల్లేదు! | - | Sakshi
Sakshi News home page

‘మురుగు’నూ వదల్లేదు!

Jun 21 2025 2:58 AM | Updated on Jun 21 2025 2:58 AM

‘మురుగు’నూ వదల్లేదు!

‘మురుగు’నూ వదల్లేదు!

చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీల్లో పూడికతీత పేరుతో నిధుల స్వాహాకు తెరలేపిన వైనం వెలుగు చూసింది. చేయని పనులకు పాత పనుల వివరాలు జోడించి బిల్లులు కొట్టేసే ప్రయత్నం కాస్త ఆడిట్‌ అధికారుల అప్రమత్తతో బెడిసి కొట్టింది. వివరాల్లోకి వెళితే... హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు శానిటరీ డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్‌ పరిధిలో రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.80 లక్షలతో డ్రెయినేజీల్లో పూడిక తీత పనులకు 8 నెలల క్రితం టెండర్లు పిలిచారు. టెండర్‌ దక్కించుకునేందుకు పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు హిందూపురం నివాసి కూడా పోటీ పడ్డారు. అయితే కొన్ని బెదిరింపుల కారణంగా పుట్టపర్తికి చెందిన కాంట్రాక్టర్‌ తన టెండర్‌ను విత్‌ డ్రా చేసుకోవడంతో సింగిల్‌ టెండర్‌ ద్వారా హిందూపురానికి చెందిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. అంచనాకు మించి 4.90 శాతం ఎక్కువకు టెండర్‌ ఖరారు చేశారు. ఈ క్రమంలో సింగిల్‌ టెండర్లు, ఎక్సెస్‌ కోట్‌ను ఆమోదించరాదంటూ మున్సిపల్‌ చైర్మన్‌కు కౌన్సిలర్లు డిసెంట్‌ నోటీసు అందజేశారు. ఈ నోటీసును ఉన్నతాధికారులకు పంపకుండా అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తొక్కిపెట్టి కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అయితే ఎలాంటి పనులు చేయకుండానే పాత పనుల ఫొటోలు, వివరాలు జోడించి బిల్లులు చేసుకునే ప్రయత్నం చేయడంతో అప్పటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారు.

నిరాకరించిన ఆడిట్‌ అధికారులు..

బిల్లులు చేసేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యం అడ్డుగా నిలవడంతో ఈఎన్‌సీ పబ్లిక్‌ హెల్త్‌కు సరెండర్‌ చేయించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. అనంతరం పనులు పూర్తయ్యాయని, 4.90 శాతం ఎక్సెస్‌ అమౌంట్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రీ ఆడిట్‌ కోసమని జిల్లా కేంద్రంలోని ఆడిట్‌ కార్యాలయానికి పంపారు. అయితే సింగిల్‌ టెండర్‌, ఎక్సెస్‌ కోట్‌ను ఒప్పుకోబోమని ఆడిట్‌ అధికారులు తేల్చిచెప్పడంతో వెనువెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒత్తిళ్లు తీసుకెళ్లారు. అయినా నిబంధనలకు వ్యతిరేకంగా తాము పని చేయలేమంటూ ఆడిట్‌ అధికారులు స్పష్టం చేస్తూ ఆ ప్రతిపాదనలను వెనక్కు పంపారు.

చెక్కు రూపంలో బిల్లు పొందే ఎత్తుగడ..

ప్రీ ఆడిట్‌ చేయించుకుని సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ద్వారా బిల్లులు పొందాలనుకుని భంగపడిన కాంట్రాక్టర్‌... తాజాగా కమిషనర్‌ను బురిడీ కొట్టించి రూ.84 లక్షలకు చెక్కు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గతంలో మున్సిపల్‌ కార్మికులు చేసిన పనుల వద్ద తాజాగా తీసిన ఫొటోలు జతపరిచి పనులు చేసినట్లుగా చూపించడమే కాక, కొన్నింటికి పాత ఫొటోలనే వాడి జతపరిచిన ఫైల్‌ను కమిషనర్‌ వద్ద పెట్టి బిల్లులను చెక్కు రూపంలో పొందేలా పావులు కదిపాడు. ఈ మొత్తం తతంగాన్ని ఎమ్మెల్యే కార్యాలయం వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. అయితే బిల్లులను ఏ కోశానా చెక్కు రూపంలో చెల్లించేందుకు వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, గతంలోనూ ఇదే కాంట్రాక్టర్‌ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని 2013లో దాదాపు రూ.22 లక్షల రికవరీకి అప్పటి అధికారులు ఆదేశించారు. 12 ఏళ్లు గడిచినా ఆ నగదును ఆయన తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. అయినా మున్సిపల్‌ అధికారులు మళ్లీ సింగిల్‌ టెండర్‌ ద్వారా పనులు కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది.

డ్రెయినేజీ పనులు చేయకుండానే రూ.80 లక్షల స్వాహాకు యత్నం

సింగిల్‌ టెండర్‌, ఎక్సెస్‌కు ప్రీ ఆడిట్‌ చేయబోమన్న జిల్లా ఆడిట్‌ అధికారులు

తాజాగా మున్సిపాలిటీ నుంచి రూ.84 లక్షల చెక్కు ఇప్పించుకునే ఎత్తుగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement