● ఎస్సెమ్సీ ఎన్నికల వేళ రౌడీయిజం
● సౌత్‌మోపూరులో కుట్రలకు తెరదీసి..
● ఆత్మకూరులో అంతా గోప్యం
● దుత్తలూరులో దాష్టీకం
నెల్లూరు సిటీ: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు నేటికీ కొనసాగుతున్న వేళ.. ఇదే ఫార్ములాను ఎస్సెమ్సీ ఎలక్షన్ల సందర్భంగా తమ్ముళ్లు ఉపయోగించారు. ఈ ఉదంతానికి నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్‌మోపూరు హైస్కూల్ వేదికై ంది. వాస్తవానికి గురువారం నిర్వహించిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ ఆందోళన చేశాయి. ఈ తరుణంలో మరోసారి శనివారం నిర్వహించగా, టీడీపీ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తమ వారినే ఎన్నుకోవాలంటూ అధికారులపై హుకుం జారీ చేశారు. దీంతో ఆఫీసర్లు సైతం చేసేదిలేక సైకిల్ పార్టీ అభ్యర్థే విజయం సాధించారని ప్రకటించారు. నిజానికి గురువారం జరిపిన ఎలక్షన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థి కాశీవిశ్వనాథ్‌కు 66.. టీడీపీ అభ్యర్థి విజయకుమార్‌కు 64 ఓట్లొచ్చాయి. అయితే ఫలితాన్ని తారుమారు చేశారు. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపి ప్రక్రియను బహిష్కరించాయి. టీడీపీ రూరల్ కార్యాల యం నుంచి వచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించారు.
కోరం లేక ఐదు
పాఠశాలల్లో నిలిచిన వైనం
నెల్లూరు (టౌన్): వెంకటగిరి జాతర కారణంగా 224, కోరం లేక 22 పాఠశాలలు.. ఇలా మొత్తం 246 చోట్ల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలను శనివారం నిర్వహించారు. వీటిలో ఐదు చోట్ల కోరం లేక ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి ఎప్పుడు నిర్వహించనున్నారో విద్యాశాఖ అధికారులు ప్రకటించనున్నారు.
ఎన్నికలేదైనా తమకే విజయం దక్కాలనే కాంక్షతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఇలానే వ్యవహరించి ఏదో సాధించామని ఫీలైన తమ్ముళ్లు తాజాగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎలక్షన్లలోనూ బరితెగించారు. పలు చోట్ల గురువారం నిర్వహించాల్సిన ప్రక్రియను శనివారానికి వాయిదా వేశారు. అయితే పచ్చ నేతల దాష్టీక పర్వం ఏ మాత్రం ఆగకపోగా, మరింత శ్రుతిమించింది. ఫలితాలను తారుమారు చేయడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిస్తే వారి పేర్లను ప్రకటించకుండా జాప్యం చేస్తుండటం.. మరోచోట ఓడిపోయినా పోస్ట్‌పోన్ చేయించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఇలాంటి చిన్న ఎలక్షన్లోనూ వీరిలా వ్యవహరిస్తుండటంపై జిల్లా వాసులు భగ్గుమంటున్నారు.


