వృద్ధురాలి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

● ఇంట్లో దోపిడీకి పాల్పడి హత్య చేసి

ఉంటారనే అనుమానాలు

● బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకే హత్య

జరిగిందా?

● టీడీపీ నేత ప్రమేయంపై అనుమానాలు

కావలి: పట్టణంలో ఓ వృద్ధురాలు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కావలి తుఫాన్‌ నగర్‌ ట్యాంక్‌ సమీపంలో నివాసముంటున్న ఆ వృద్ధురాలి ఒంటిపై నగలు మాయం కావడం, బీరువా తెరచి ఉండడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ట్యాంక్‌ వెనుక భాగంలో పొంగూరు విజయలక్ష్మి (65) తన నివాసంలో ఉంటున్నారు. ఆమె వడ్డీ వ్యాపారం చేస్తుంటారని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇటీవల నగదు తీసుకున్న వారు తిరిగివ్వడం లేదని పలువురు మహిళల వద్ద ఆమె విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమె వద్ద భారీగా అప్పు తీసుకున్న ఓ మహిళ ఇటీవల మృతురాలితో గొడవ పడినట్లు సమాచారం. కాగా గురువారం మధ్యాహ్నం వరకు అందరితో మాట్లాడిన విజయలక్ష్మి సాయంత్రం వేళ ఇంటి పని చేసేందుకు వచ్చిన వ్యక్తి తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో పక్కింటి మహిళ ఎందుకు తలుపులు కొడుతున్నావు? అని ప్రశ్నించగా.. పనికి పిలిచిందని, అందుకే వచ్చానని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన ఇద్దరూ కలిసి తలుపులు తెరచి చూడగా విజయలక్ష్మి వంట గది వద్ద నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే మహిళ ఈ విషయాన్ని ఆమె బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ ఎస్సైలు గోపీచంద్‌, వెంకటేశ్వర్లు, కావలి రూరల్‌ ఎస్సై తిరుమలరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ రమణకుమార్‌ పరిశీలించారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాల్లేవు. దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆర్థిక లావాదేవీల్లో టీడీపీ నేత?

మృతురాలు విజయలక్ష్మి వద్ద అధికార పార్టీకి చెందిన ఓ నేత భారీ మొత్తంలో అప్పు తీసుకుని బాకీ పడ్డారని, ఇటీవల నగదు చెల్లింపు విషయంలో ఆ నేతను నిలదీయడంతో గొడవ పడినట్లు ప్రచారం జరుగుతోంది. బాకీ అడిగిన సందర్భంలో ఆ నేత దురుసుగా మాట్లాడినట్లు.. అప్పటి నుంచి విజయలక్ష్మి విచారంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా పలువురు ఆమెకు బాకీ ఉన్నారని, ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement