● పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్
నెల్లూరు(టౌన్): విద్యారంగంలో, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ 17వ మహాసభల సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి సర్వోదయ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జీఓ నంబర్ 77ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మెడికల్ విద్య ప్రైవేటీకరణను నిలిపివేసి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 102ను రద్దు చేసి పాత జీఓ నంబర్ 151 ప్రకారం మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,400 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, సహాయ కార్యదర్శి లోకేశ్, జిల్లా అధ్యక్షుడు సునీల్, నాయకులు ఆశీర్, సుభాన్, శ్రావణ్, సాయిచరణ్, వసీం, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


