కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు

ఉదయగిరి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, జిల్లా కార్యదర్శి మూల రమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆ పార్టీ బృంద సభ్యులు మండలంలోని నేలటూరు, సర్వరాబాదు గ్రామాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి కరువు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వరికుంటపాడు మండలంలో అసంపూర్తిగా ఉన్న పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను, గండిపాళెం జలాశయాన్ని సందర్శించారు. అనంతరం ఉదయగిరి సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయగిరి ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. నేలటూరులో పశువులు, జీవాల మేత కష్టాలను తీరుస్తున్న గ్రామ సమీపంలోని సుమారు 263 ఎకరాల భూమిని రిలయన్స్‌ కంపెనీకి అప్పజెప్పడం దారుణమన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం రైతులు సాగుచేసిన పంటలు చేతికందక నష్టపోయారన్నారు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు తిండి కరువై ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాపారస్తులు నిత్యావసర సరుకులను గోదాముల్లో నిల్వ ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఉపాధి పనులు కల్పించడంలో ప్రభుత్వ అధికారి యంత్రాంగం పూర్తిగా విఫలమవడంతో వలసలు పెరిగిపోతున్నాయన్నారు. వెలిగొండలో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు రూ.3 వేల కోట్లు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత ప్రజల సాగు తాగునీటి కష్టాలు తీర్చాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్‌రావు, వెంగయ్య, ప్రసాద్‌, గోపాల్‌, వెంకటయ్య, పుల్లయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement