నెల్లూరు రూరల్: విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వినతిపత్రం అందించేందుకు యత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి.. యువజన విభాగ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బారకాస్ సెంటర్ నుంచి పాత జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీని బుధవారం చేపట్టిన అనంతరం వీరు మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సైతం అవకాశమివ్వకపోవడం దారుణమని విమర్శించారు. వాస్తవానికి వినతిపత్రమిచ్చే అంశమై తొలుత 50 మందికి అనుమతిస్తామని చెప్పిన ఖాకీలు చివరికి నలుగురికే పర్మిషన్ ఇస్తామన్నారని పేర్కొన్నారు. ఆపై నగరంలో విద్యార్థి, యువజన విభాగాల నేతలను ఇళ్ల వద్దే నిర్బంధించారని ఆరోపించారు. వీరిని చంద్రశేఖర్‌రెడ్డి కలిసి పోలీసులను ప్రశ్నించడంతో కొందర్ని విడుదల చేసినా, మిగిలిన వారిని నిర్బంధంలోనే ఉంచారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడన్నారు.
గొంతునొక్కే యత్నం తగదు
కూటమి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు దాటినా, రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు భృతిని ఇవ్వలేదని, దీన్ని అమలు చేయాలని కోరేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. వీరి సమస్యలను పరిష్కరించాల్సిన సర్కార్, అందుకు భిన్నంగా గొంతునొక్కే యత్నాలు చేయడం సరికాదని చెప్పారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతో పోలీసులతో అడ్డుకుంటారానని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దాదాపు రూ.ఐదు వేల కోట్ల బకాయిలున్నాయని, వీటిని చెల్లించలేక కళాశాలల్లో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్టళ్లలో ఫీజులు, భోజన బిల్లులను చెల్లించేందుకు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారని వివరించారు. నిధులను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి లోకేశ్‌కు
వినతిపత్రమివ్వాలనుకోవడం తప్పా..?
వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నేతల నిర్బంధం దారుణం
మండిపడిన మాజీ మంత్రి కాకాణి,
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి


