జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడు

Sep 16 2026 11:56 PM | Updated on Sep 16 2026 11:56 PM

నెల్లూరు(పొగతోట): నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని గురువారం ఉదయం 10.30కు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న మీటింగ్‌కు ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు. కాగా ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ఈ నెల 24తో ముగియనున్న తరుణంలో ఇదే చివరి సర్వసభ్య సమావేశం కానుంది.

పింఛన్ల దరఖాస్తుల

దాఖలుకు గడువు పొడిగింపు

నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తు గడువును శుక్రవారం వరకు పొడిగించారని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణ గ్రామ.. స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నామని వివరించారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఏఆర్టీ, డయాలసిస్‌, ట్రాన్స్‌జెండర్‌, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు తదితరులు నిబంధనలకు అనుగుణంగా అప్లయ్‌ చేసుకోవాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది దర్శించుకున్నారు. తలనీలాలను 18,722 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.7 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. ఇవి లేని వారికి నాలుగు గంటల్లో అవుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారికి మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

వెంగమాంబ హుండీ కానుకల లెక్కింపు

దుత్తలూరు(ఉదయగిరి): మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. ఈ ఏడాది ఆగస్ట్‌ ఏడు నుంచి బుధవారం వరకు కానుకల రూపంలో భక్తులు రూ.11,62,030 మేర సమర్పించారు. ఈఓ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధుల

నివారణకు చర్యలు

నెల్లూరు(అర్బన్‌): సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం సూచించారు. సీజనల్‌ వ్యాధులపై జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో సబ్‌ యూనిట్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. డెంగీ, మలేరియా నివారణ కోసం టీమ్‌లను సిద్ధం చేయాలని కోరారు. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు నిలిస్తే, అక్కడ పెరిగే దోమల లార్వాల శాంపిళ్లు తీసి పరీక్షించాలన్నారు. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు కలిగించే దోమల లార్వాలున్నాయని ల్యాబొరెటరీల్లో గుర్తిస్తే తక్షణమే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఏఎంఓ జయరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement