● వాహన్ వెబ్‌సైట్ పనిచేయక ఇక్కట్లు
● 15 రోజులుగా ఇదే పరిస్థితి
నెల్లూరు (టౌన్): రవాణా శాఖలో సేవలు పొందే అంశంలో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. వాహన్ వెబ్‌సైట్ 15 రోజులుగా పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రైమాసిక పన్ను చెల్లింపు.. వెహికల్ ట్రాన్స్‌ఫర్.. కొత్త వాహనానికి నంబర్ కేటాయింపు.. లైసెన్స్ రెన్యువల్.. ఫైనాన్స్ క్లియరెన్స్.. ఇలా పలు సేవలు పనిచేయడంలేదు. కొత్త వాహనానికి సంబంధించిన నంబర్ కోసం డబ్బులు చెల్లించి రిజర్వేషన్ చేసుకున్నా, మళ్లీ ఇంకో నంబర్ అలాటవుతోంది. రిజర్వేషన్ కోసం చెల్లించిన డబ్బులు తిరిగి పొందేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రవాణా శాఖలో సేవల కోసం వాహన్ ఎన్‌ఐసీ సైట్‌ను ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది పలుమార్లు మొరాయించింది. అటు సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సైట్.. ఇటు ఉద్యోగుల క్లియరెన్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చినవీ పనిచేయడంలేదు.
కేసులు నమోదు చేస్తున్న అధికారులు
వెహికల్‌కు సంబంధించిన పత్రాల్లేవంటూ రవాణా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైట్ పనిచేయక సకాలంలో జరగడంలేదని చెప్పినా.. దాంతో తమకు సంబంధం లేదని, అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారని వాపోతున్నారు. త్రైమాసిక పన్నును చెల్లించలేకపోతుండటంతో వాహనాన్ని తిప్పాలంటేనే భయమేస్తోందని పేర్కొంటున్నారు. లైసెన్స్ రెన్యువల్ సమస్యా తీవ్రంగా ఉంది. వాహనదారుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సురెన్స్ సైతం రాదు. పైగా క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. కాగా వాహన్ సైట్ పనిచేయకపోవడంపై ఆర్టీఓ మదానీని సంప్రదించగా, మాడిఫికేషన్‌తో సమస్య ఉందని చెప్పారు. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంతో తెలియదని బదులిచ్చారు.


