వరికుంటపాడు: బత్తాయి రైతులకు గడ్డుకాలం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటకు ఆశించిన ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు లభించకపోతుండడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 12 వేల ఎకరాల్లో సాగు
ఉమ్మడి జిల్లాలో బత్తాయి తోటలను సుమారు 12 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, సీతారామపురం మండలాల్లో 1920 ఎకరాల్లో.. వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల్లో మరో 600 ఎకరాల్లో బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. అలాగే ఇతర మండలాల్లోనూ విస్తారంగా తోటలను సాగుచేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఆశాజనకంగా ధరలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బత్తాయికి మంచి ధరలు లభించడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. టన్ను సుమారు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలకడంతో రైతులు లాభాలను చవిచూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలు పతనమయ్యాయి. దళారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించడంపై దృష్టి సారించకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
గిట్టుబాటు కాని ధరలు
ప్రస్తుతం బత్తాయి ధరలు భారీగా పతనమయ్యాయి. టన్ను రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. ఎకరా బత్తాయి తోట నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు సుమారు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడులు వచ్చినా మార్కెట్‌లో సరైన ధరలు లభించని కారణంగా పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బత్తాయి కాయల నాణ్యత సరిగా లేకపోతే టన్ను రూ.10 వేలకే ఇవ్వాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బత్తాయి తోటలపైన పడింది. ఆగస్టు నెల ముగుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తోటల సాగుకు జంకుతున్నారు. పాత తోటలకు అవసరమైన నీరు అందడం కష్టంగా మారిందని వాపోతున్నారు. సాధారణంగా వర్షాలు సకాలంలో కురిస్తే బత్తాయి కాయలు పక్వానికి వచ్చే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి మట్టం తగ్గడంతో తోటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. దీంతో సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టన్ను రూ.15 వేలకే పరిమితం
గతంలో రూ.30 వేలకుపైగా పలికిన వైనం
ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడులు
దిగుబడి ఐదారు టన్నులే
ఆదాయం అంతంతమాత్రమే
ఎరువుల కోసం మండలాలు దాటుతున్న వైనం
వర్షాభావంతో తగ్గుతున్న
భూగర్భ జలాలు
కొత్తగా తోటలేయాలంటేనే జంకుతున్న రైతులు
బత్తాయి తోటలకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు సకాలంలో లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో ఆర్బీకేల్లో అవసరమైన మేరకు ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి
నాకు రెండెకరాల బత్తాయి తోట ఉంది. సుమారు ఆరు నుంచి ఏడు టన్నుల కాయలు కోతకు వచ్చి ఉన్నాయి. ప్రస్తుతం బత్తాయి ధరలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ధరలు మాత్రం ఉండక నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి బత్తాయికి గిట్టుబాటు ధర కల్పిస్తేనే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
– నూతలపాటి మాల్యాద్రి, వేంపాడు, వరికుంటపాడు మండలం
గిట్టుబాటు ధరలు కల్పించాలి
నాకు 12 ఎకరాల బత్తాయి తోట ఉంది. సుమారు 40 నుంచి 50 టన్నుల కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టన్ను కాయల ధర రూ.15 వేలు మాత్రమే ఉంది. ఈ ధరతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.
– జక్కం శ్రీనివాసులురెడ్డి,
తూర్పుకొండారెడ్డిపల్లి, వరికుంటపాడు మండలం


