● నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో
విజయమే లక్ష్యం
● అందరూ కలిసికట్టుగా పనిచేయాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణలు పనిచేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. బూటకపు హామీలతో అధికారంలోకి రావడం.. అనంతరం వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, దీనిపై తమ పార్టీ అధినేత ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. తప్పును అధికారులపై నెట్టేసే యత్నాలను చంద్రబాబు, లోకేశ్ ప్రారంభించారని చెప్పారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం మినహా ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
పార్టీ శ్రేణులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నెల్లూరు సిటీ పరిధిలోని 36 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సమష్టిగా పనిచేయాలని కోరారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యముంటుందని చెప్పారు. నెల్లూరు ప్రజలకు సేవ చేసిన నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు.
అందర్నీ కలుపుకొని పనిచేద్దాం
పార్టీలో నువ్వు.. నేననే భావనకు తావులేదని, అందరం జగనన్న సైనికులమేనని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో భయం మొదలైందని తెలిపారు. పాలనను మంత్రి నారాయణ గాలికొదిలి దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కొన్ని సిద్ధాంతాలతో పనిచేయాలని, కార్యకర్తల్లో ఒకడిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భేదాభిప్రాయాలను పక్కనబెట్టాలని పిలుపునిచ్చారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి తాము పోరాడుతున్నామంటే అది జగనన్న ఇచ్చిన ధైర్యమేనన్నారు.
ఐడీ కార్డుల పంపిణీ
పార్టీ నేతలకు ఐడీ కార్డులను కాకాణి, పర్వతరెడ్డి అందజేశారు. మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీ ఖలీల్ అహ్మద్, నెల్లూరు నగర, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పేర్నేటి కోటేశ్వర్‌రెడ్డి, నగర నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


