నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నేత రూత్ గ్రేస్ పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్‌లో శనివారం నిర్వహించిన జేఏసీ జోన్ – 4 (ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల) ప్రథమ మహాసభలో ఆమె మాట్లాడారు. పిల్లల తిండి, సెలవులు, ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం 15 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నామని చెప్పారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నామని, తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాజకీయ నేతలు, రాష్ట్ర ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కారణంలోనే జేఏసీని ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చారని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వారికి అనారోగ్యమొస్తే సెలవులు.. రెగ్యులర్ చేసేంతవరకు 100 శాతం గ్రాస్ జీతం.. విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాతో పాటు కారుణ్య నియామకాన్ని కల్పించాలని, అప్పటి వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. వీరి పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను జేఏసీ రాష్ట్ర చైర్మన్ విద్యాసాగర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. అసలు కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు అని సీఐటీయూ జిల్లా నేత నరమాల సతీష్ ఆరోపించారు. ఏపీ ఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ, మహిళా కన్వీనర్ లక్ష్మి, వైద్య ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ శరత్‌బాబు, రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు,, రాష్ట్ర కన్వీనర్ అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


