లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి

నెల్లూరు (లీగల్‌): కక్షిదారులు రాజీపడొస్తే లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయాన్ని అందిస్తామని.. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ నరసింహమూర్తి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ తీర్పునకు అప్పీల్‌ కూడా ఉండదని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మార్చి, జూలైల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 97,968 కేసులను పరిష్కరించామని చెప్పారు. తాజాగా జరిపిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 31,560 కేసులను పరిష్కరించి.. లబ్ధిదారులకు రూ.9,08,45,592 మేర చెల్లించారు.

నెల్లూరులో పది ప్రత్యేక బెంచ్‌లు

నెల్లూరులోని వివిధ కోర్టుల్లో పది ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్‌ అధికారులుగా న్యాయమూర్తులు శరత్‌బాబు, సుధ, శుభవాణి, జానీబాషా, శ్రీనివాస్‌, శారదారెడ్డి, నిషాద్‌ నాజ్‌, సులోచన రాణి, సాయిరామ్‌ వ్యవహరించి 9347 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మశ్రీ పర్యవేక్షించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శరత్‌బాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, కార్పొరేషన్‌ కమిషనర్‌ నందన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement