నెల్లూరు (టౌన్): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్షను నవంబర్ 11న నిర్వహించనున్నారని వెల్లడించారు. కుటుంబ వార్షికాదాయం రూ.3.5 లక్షల్లోపు ఉన్నా వారే అర్హులని చెప్పారు. పరీక్ష రుసుముగా రూ.100ను ఓసీ, బీసీ విద్యార్థులు.. రూ.50ను ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తల
పరిశీలన
ఆత్మకూరు రూరల్: మండలంలోని మహిమలూరులో పొలాన్ని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్) శాస్త్రవేత్తలు గురువారం సందర్శించారు. సహజ వ్యవసాయం, రసాయన వ్యవసాయ పద్ధతుల మధ్య వ్యత్యాసాలను పరిశీలించడంతో పాటు పంటల వేరు వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు గానూ దీన్ని చేపట్టారు. రమణారెడ్డి పొలాన్ని ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు బండప్ప, సతీష్ ఆధ్వర్యంలోని బృందం సందర్శించి వివిధ అంశాలను పరిశీలించారు. భరత్, అరుణ్, శ్రీనివాసులు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
వీబీ – జీ రామ్ జీ
పనుల తనిఖీ
మనుబోలు: మండలంలోని కాగితాలపూరులో జరుగుతున్న వీబీ జీరామ్ జీ పనులను కేంద్ర బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. గ్రామంలోని సోప్ కిట్‌ను కేంద్ర బృంద సభ్యులు ప్రసాద్, గోవర్ధన్.. ఏపీడీ గాయత్రి ఆధ్వర్యంలో పరిశీలించారు. నగదు అందిందాననే విషయమై లబ్ధిదారుడు గోను వెంకటరమణయ్యను అడిగి తెలుసుకున్నారు.


