ఆత్మకూరు రూరల్: ఎఫ్సీవీ పొగాకు పంట నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సును మండలంలోని వెన్నవాడలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్ర నిర్వహణాధికారి సునీల్‌కుమార్ మాట్లాడారు. మార్కెట్లో ధరల పతనాన్ని నివారించేందుకు గానూ బోర్డు నిర్దేశించిన కోటా మేరకే పొగాకును సాగు చేయాలని సూచించారు. అనుమతుల్లేకుండా కొత్త బ్యారన్లను నిర్మించొద్దని కోరారు. దీనిపైనే ఆధారపడకుండా ఇతర లాభదాయక పంటలనూ సాగు చేయాలని సూచించారు. ఒక్కో బ్యారన్‌కు పొగాకు బోర్డు ద్వారా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం అందుబాటులో ఉందన్నారు. అధిక సాగు ఖర్చుల దృష్ట్యా కౌలు భూముల్లో పొగాకును సాగు చేయకుండా సొంత భూమి, లైసెన్స్ కలిగిన రిజిస్టర్డ్ రైతులే చేపట్టాలని పేర్కొన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు ఆదర్శ్ జగన్నాథ్, విజయ్, ఫీల్డ్ సూపర్‌వైజర్లు వైష్ణవి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


