● సకాలంలో చికిత్సతో కుష్టు నయం
● జిల్లాలో 1,038 మంది వ్యాధిగ్రస్తులు
● నేటి నుంచి 14 రోజులపాటు సర్వే
●
నెల్లూరు(అర్బన్): కుష్టు.. ఈ పదం వినగానే బాధితుల్లో భయం మొదలవుతోంది. సమాజం చిన్నచూపు చూస్తుందేమోనని, బంధువులు దూరం పెడతారేమోనని ఆందోళన చెందుతారు. ఈ అపోహలు వ్యాధి కంటే ఎక్కువగా బాధిస్తున్నాయి. చేతిపై, ఛాతిపై తెలుపు, రాగి లేదా నలుపు రంగులో గుండ్రంగా మచ్చ ఏర్పడుతుంది. సాధారణంగా ఆ మచ్చపై నొప్పి ఉండదు. క్రమంగా స్పర్శ తగ్గుతుంది. మరోచోట కూడా స్పర్శ లేని మచ్చ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పరీక్షల్లో కుష్టు వ్యాధిగా నిర్ధారణ అయితే సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేసి చికిత్స తీసుకోకపోతే నరాలపై ప్రభావం చూపి అంగవైకల్యానికి దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
ఇంటింటికీ వెళ్లి సర్వే
జిల్లాలో కుష్టు వ్యాధి ప్రారంభ దశ లక్షణాలను గుర్తించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 14 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఖాదర్‌వలీఆధ్వర్యంలో 1,847 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులుంటారు. మహిళలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రతి బృందంలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సర్వేకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో 1,038 మంది
జిల్లాలో ప్రస్తుతం 1,038 మంది వ్యాధిగ్రస్తులున్నారు. వారి కోసం రాపూరు సమీపంలో ఒక కాలనీ, నెల్లూరు రూరల్ ఆమంచర్ల వద్ద రెండు కాలనీలను ఏర్పాటు చేశారు. గతేడాది నుంచి ఈ సంవత్సరం వరకు కొత్తగా 54 కేసులను గుర్తించారు. అర్హత ఉన్న 714 మందికి ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. మరో 149 మందికి ఏఏవై కార్డుల ద్వారా నెలకు 35 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందుకుటున్నారు. వైద్యశాఖ తరఫున ప్రతి కుష్టు వ్యాధిగ్రస్తుడికి ఏడాదికి రెండు జతల ఎంసీఆర్ చెప్పులు, ఒక టబ్, రెండు చిన్న టవల్స్, నీమ్ ఆయిల్, గరుకు రాయి అందిస్తున్నారు. అవసరమైన వారికి బ్యాండేజీలు, కాటన్ రోల్స్ కూడా ఇస్తున్నారు. ఎనిమిది మందికి వాకర్స్, 150 మందికి చేతి కర్రలు, నలుగురికి సంకలో వేసుకునే కర్రలు అందించారు.
వ్యాధి కన్నా అపోహలే ఎక్కువ
కుష్టు వ్యాధిపై సమాజంలో అనేక అపోహలున్నాయి. వ్యాధిగ్రస్తుడిని తాకితే తమకు వస్తుందని, జీవితాంతం అంటువ్యాధిగానే ఉంటుందని భావిస్తుంటారు. వాస్తవానికి మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. వ్యాధిగ్రస్తుడితో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. తాకినంత మాత్రాన కుష్టు వ్యాధి రాదు. కలిసి భోజనం చేయడం, పక్కన కూర్చోవడం వల్ల కూడా సోకదు.
అప్రమత్తత అవసరం
చర్మంపై స్పర్శ తగ్గిన మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చర్మం దళసరిగా మారడం, నరాలు మందంగా అనిపించడం, గాయాలు ఏర్పడినా నొప్పి తెలియకపోవడం, కనుబొమ్మల వెంట్రుకలు రాలడం, చెవి దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను నివారించవచ్చు.


