కోట గురుకులం మూసివేతపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కోట గురుకులం మూసివేతపై ఆందోళన

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం ఇటీవల మూసివేసిన కోట గురుకుల పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలని ఇన్సాఫ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు వీరంరెడ్డి సురేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురుకులం మూసివేతకు నిరసనగా గురువారం నెల్లూరులోని సాంఘిక సంక్షేమశాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ (డీసీఓ) కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 600 మంది పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకునే పాఠశాలను ఒక్కసారిగా మూసివేయడం దారుణమన్నారు. పలు విద్యార్థి సంఘాలతో కలిసి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ప్రాణత్యాగాలకు సైతం సిద్ధమన్నారు. మద్రాస్‌ బస్టాండ్‌ కూడలి నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, విద్యార్థులు భారీ ప్రదర్శనగా బయలుదేరి డీసీఓ కార్యాలయానికి చేరుకుని ముట్టడి చేపట్టారు. విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ వారు కార్యాలయ ముట్టడి నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో ఏఐఎం జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌, బీవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, ఎస్‌పీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షఫీ తదితరులు పాల్గొన్నారు.

సీఓఈ కోసం ప్రభుత్వ పెద్దల ఆరాటం

కోట: దళిత సంఘాల ఉద్యమం తీవ్రమవుతుండడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. పోరాటాన్ని కట్టడి చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. గురువారం వందమంది వరకు అడ్మిషన్లు పొందిన ఇంటర్‌ విద్యార్థులను సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) నీట్‌, ఐఐటీ శిక్షణ కేంద్రానికి ఒక్కసారిగా తరలించారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఎస్సీ గురుకులాన్ని సీఓఈ కేంద్రంగా మార్చిన క్రమంలో మంత్రి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే రోజురోజుకూ దళిత, విద్యార్థి సంఘాల ఉద్యమం తీవ్రమవుతున్న క్రమంలో వారు అడ్డుకునే అవకాశం ఉంది. అధికారులు ఎటువంటి హడావుడి లేకుండా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులను తరలించినట్లు సమాచారం. ఈ విషయమై ప్రిన్సిపల్‌ ఆనందరావును వివరణ కోరగా నీట్‌, ఐఐటీ శిక్షణ కోసం విద్యార్థులు వస్తున్నారని, మిగిలిన విషయాలు ఉన్నతాధికారులే చూస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement