● అక్రమంగా చెరువు మట్టి తరలింపు
చేజర్ల: మండలంలోని పెల్లేరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఈ తంతు జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరుడు టీడీపీ మండల నేత కొమ్మి సిద్ధుల నాయుడు మట్టిన తన సొంత పొలాలకు అక్రమంగా తరలిస్తున్నాడని గ్రామస్తులు గురువారం ఆరోపించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ భారీ స్థాయిలో మట్టిని లోడేయడంతో భూగర్భ జలాలు భారీ స్థాయిలో అడుగంటే ప్రమాదం ఉంది. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఈ తరుణంలో సామాన్య రైతు లోతట్టు మాగాణి భూములకు తోలుకునేందుకు ఒక ట్రక్కు మట్టికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అయితే వందలాది ట్రాక్టర్ల మట్టిని ప్రభుత్వ చెరువులు, భూములు నుంచి ఎత్తుకెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


