● వ్యక్తి మృతి
వెంకటాచలం: రొయ్యల గుంత వద్ద పొరపాటున ఓ రసాయనం తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ఇడిమేపల్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఆర్కట్‌పాళేనికి చెందిన కర్పంగారి తిరుపతయ్య (55) మరికొందరితో కలిసి రొయ్యలు పట్టేందుకు బుధవారం ఇడిమేపల్లికి వెళ్లాడు. అక్కడ పనిలో నిమగ్నమై ఉండగా రొయ్యల కోసం ఉపయోగించే ఓ రసాయనాన్ని పొరపాటున మంచినీరుగా భావించి తిరుపతయ్య తాగేశాడు. మేస్త్రి లేబూరు శ్రీనివాసులు గుర్తించి వెంటనే బాధితుడిని ఆటోలో ముత్తుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. తిరుపతయ్య కుటుంబ సభ్యులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
కండలేరులో 18.03 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 18.03 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 800, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 110, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


