● మాజీ మంత్రి
అనిల్‌కుమార్ యాదవ్
● బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం
బుచ్చిరెడ్డిపాళెం/కోవూరు: ‘కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం లేదు. అవినీతి, అక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు. కోవూరులో అవినీతి తాండవం చేస్తోంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. అనిల్ మాట్లాడుతూ కొందరు నాయకులు సేవ చేసింది గోరంత.. ప్రచారం చేసుకుంటున్నది కొండంత అంటూ ఎద్దేవా చేశారు. కోవూరు నుంచి చైన్నె వైపు ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల అండ ఉందని ఆరోపించారు. సహజ వనరులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటి దోపిడీని అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి కంటే రాజకీయ కక్షపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేసే ముందు ప్రజలకు చేసిన సేవ చూపించాలన్నారు. ప్రజలను మోసం చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరన్నారు. పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప ప్రత్యేకంగా వీపీఆర్ దంపతులు ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదన్నారు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇతర ప్రాంతాల నాయకులను ఇక్కడికి తీసుకొచ్చి పెత్తనం చేయిస్తున్నట్లు చెప్పారు.
కాలభైరవుడు మీ అంతు చూస్తాడు
ప్రసన్న మాట్లాడుతూ అనిల్‌కుమార్ యాదవ్ ఆధారాలతో వీపీఆర్ దంపతుల అవినీతిని బయటపెట్టారన్నారు. వాటికి సమాధానం చెప్పే ధైర్యం, దమ్ము వారికి లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తమను ప్రశాంతిరెడ్డి కుక్కలతో పోల్చారని, అవి విశ్వాసానికి ప్రతీక అన్నారు. తాము పదవులు పొంది పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారు కాదన్నారు. కుక్కలు సాక్షాత్తు కాలభైరవ స్వరూపాలని ప్రజలకు, తమను నమ్మిన వారికి విశ్వాసంగా ఉంటాయన్నారు. అలాంటి కాలభైరవుడే మీలాంటి రాక్షసుల అంతు చూస్తాడని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేసే వీపీఆర్ దంపతులు తమను ఏనుగులతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీగా మారడం, అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లుగా గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయే వారిని కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నమ్మకమైన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని స్థానిక నాయకులకు సూచించారు.
మాట ఇస్తే తప్పని నాయకుడు జగన్
ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, నగర పంచాయతీ అధ్యక్షుడు ఎస్‌కే షాహుల్, రూరల్ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


