కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని తేలుకాటుకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన పర్రే మంజుల ఉదయం పాఠశాలలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి పుస్తకాల కోసం డెస్క్‌లో చేయి పెట్టగా అక్కడున్న తేలు కుట్టింది. నొప్పితో వెంటనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు బాలికను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.


