● ఆరు కేసుల నమోదు
● రూ.5 లక్షల జరిమానా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ విజిలెన్స్ విభాగపు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కావలి రూరల్, బోగోలు, చిల్లకూరు, వాకాడు ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిని గుర్తించి ఆరు కేసులు నమోదు చేసి, రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ విజిలెన్స్ విభాగపు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుధాకర్ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం కారణంగా ఆర్థిక నష్టం జరుగుతోందని, దీనివల్ల సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడుతోందన్నారు. విద్యుత్ చౌర్యం నేరమని, ఇలాంటి పనులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


