హెపటైటిస్‌తో లివర్‌కు ముప్పు | - | Sakshi
Sakshi News home page

హెపటైటిస్‌తో లివర్‌కు ముప్పు

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

ఆహార అలవాట్లు, వైరస్‌లతో

దెబ్బతినే ప్రమాదం

నిర్లక్ష్యం చేస్తే ఫ్యాటీ లివర్‌, సిర్రోసిస్‌,

కేన్సర్‌కు దారి

జిల్లాలో 25 వేల మందికిపైగా

బాధితులున్నట్లు అంచనా

నేడు వరల్డ్‌ హెపటైటిస్‌ డే

నెల్లూరు(అర్బన్‌): హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌లు లివర్‌ను నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. ముందుగా గుర్తించకపోతే లివర్‌ దెబ్బతిని సిర్రోసిస్‌, కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి ముదిరే వరకు చాలామందికి లక్షణాలు కనిపించవు. హెచ్‌బీఎస్‌ఏజీ వంటి రక్తపరీక్షల ద్వారా మాత్రమే వైరస్‌ను గుర్తించగలరు. ఈలోపు సంవత్సరాలపాటు నెమ్మదిగా లివర్‌ను దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూలై 28ను వరల్డ్‌ హెపటైటిస్‌ డేను నిర్వహిస్తోంది. మంగళవారం జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.

జిల్లాలో ఇలా..

జిల్లా వైద్యశాఖ వద్ద పూర్తిస్థాయి గణాంకాలు లేకపోయినా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), సీనియర్‌ వైద్యుల అంచనా ప్రకారం జిల్లాలో 25 వేల మందికిపైగా హెపటైటిస్‌ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నమోదైన వివరాల ప్రకారం 2022లో 14,684 మందికి పరీక్షలు నిర్వహించగా 205 మందికి బీ రకం వైరస్‌ నిర్ధారణ అయింది. 2023లో 21,837 మందికి పరీక్షలు చేయగా 404 మంది, 2024లో 23 వేల మందికి పరీక్షలు చేయగా 457 మంది, 2025లో సుమారు 64 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 600 మందికి బీ రకం ఉన్నట్లు తేలింది. ఇక సీ రకం వైరస్‌ విషయంలో 2022 నుంచి 2024 మధ్య 73 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 2025లో మరో 200 మందికి ఉన్నట్లు తేలింది. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డయాలసిస్‌ రోగులు, ఖైదీలు, ఏఆర్‌టీ చికిత్స పొందుతున్న వారికి నిర్వహించిన పరీక్షల్లో మరో 500 మంది వరకు వైరస్‌ల బారినపడినట్లు గుర్తించారు. జిల్లాలోని 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రితోపాటు ప్రైవేట్‌, కార్పొరేట్‌ హాస్పిటళ్ల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 25 వేల మందికిపైగా వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.

ఎలా సోకుతుంది?

రక్షణలేని లైంగిక సంబంధాలు, ప్రసవ సమయంలో తల్లి నుంచి శిశువుకు హెపటైటిస్‌ బీ సోకే అవకాశం ఉంది. రక్తమార్పిడి, కలుషిత సూదుల ద్వారా బీ, సీ వైరస్‌లు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా ఏ, ఈ రకాలు ఎక్కువగా వస్తాయి. జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), ముదురు రంగు మూత్రం లక్షణాలుగా ఉన్నాయి.

అవగాహన తప్పనిసరి

హెపటైటిస్‌ వైరస్‌లు ప్రాణాంతకం. ఇవి లివర్‌ను ప్రధానంగా దెబ్బతీస్తాయి. అందువల్ల ఈ జబ్బులపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. బీ రకం రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. నవజాత శిశువులకు 24 గంటల్లోపే వ్యాక్సిన్‌ వేయించాలి. ప్రతి ఒక్కరూ హెపటైటిస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకుని ఒకవేళ వైరస్‌ ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నుంచి నాలుగేళ్లపాటు మందులు వాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచే హెపటైటిస్‌ పరీక్షలు నిర్వహించాలి.

– డాక్టర్‌ సునీల్‌కుమార్‌,

సీనియర్‌ ఫిజీషియన్‌, సర్వజన ఆస్పత్రి

వాటితోనే ఎక్కువగా..

హెపటైటిస్‌లో మొత్తం ఐదు రకాల వైరస్‌లున్నాయి. ఏ రకం వైరస్‌ సాధారణంగా కామెర్ల రూపంలో కనిపించి మూడు వారాల విశ్రాంతితో తగ్గిపోతుంది. డీ, ఈ రకాలు అరుదుగా వస్తాయి. అయితే బీ, సీ వైరస్‌లు సోకితే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హెపటైటిస్‌ బీ వైరస్‌కు పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం శరీరంలోనే ఉంటుంది. వైరస్‌ లోడ్‌ను తగ్గించే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే సీ రకానికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో బీ, సీ రకాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.

నివారణే ఉత్తమ మార్గం

హెపటైటిస్‌ బీ నివారణకు ముందస్తుగా టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. సురక్షిత రక్తాన్ని మాత్రమే వినియోగించాలి. ఒక్కసారి ఉపయోగించిన సూదులను మళ్లీ వాడకూడదు. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement