● నిరసనకు కాకాణి, పర్వతరెడ్డి సంఘీభావం
నెల్లూరురూరల్: జీఓ నంబర్ 396 పేరుతో కూటమి ప్రభుత్వం వేలాది మంది దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై దెబ్బకొట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. జీఓను వ్యతిరేకిస్తూ నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో సోమవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లను వారు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే పరిస్థితికి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. జీఓను తక్షణమే రద్దు చేసి వారి ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సేవలను, ఆస్తులను ప్రైవేట్‌పరం చేసే విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. ఇప్పటి వరకు డాక్యుమెంట్ రైటర్ల వల్ల ప్రజలు రిజిస్ట్రే షన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకుంటున్నారని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడం సమంజసం కాదన్నారు. 396 నంబర్ జీఓ వారి పాలిట శాపంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, నాయకులు, డాక్యుమెంట్ రైటర్ల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.


