జీతాలివ్వండయ్యా.. | - | Sakshi
Sakshi News home page

జీతాలివ్వండయ్యా..

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

నెల్లూరు(అర్బన్‌): మూడు నెలలుగా రావాల్సిన జీతాలు వెంటనే ఇప్పించాలంటూ నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు సోమవారం విధులు బహిష్కరించి ఆకస్మికంగా ధర్నా చేశారు. పనులు ఆపేయడంతో రోగులను పట్టేందుకు దిక్కులేకుండా పోయింది. పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. దీంతో ఆస్పత్రి ఏడీ ఏడుకొండలు కార్మికులతో చర్చించారు. నెల జీతం ఒక్కరోజులోనే ఇచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. మరోనెల జీతం పదిరోజుల తర్వాత ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయినా కార్మికులు తగ్గలేదు. దీంతో సీఐటీయూ రూరల్‌ కార్యదర్శి కె.పెంచల నరసయ్య, యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సతీష్‌, ప్రధాన కార్యదర్శి సందానీబాషా వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ జీతాల కోసం కాంట్రాక్టర్‌తో మాట్లాడాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవి వద్దకు వెళ్లగా తమను చులకన చేసి మాట్లాడారన్నారు. మూడు నెలలకే తొందరపడితే ఎలా అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు కలవాలని వస్తున్నారంటూ చిరాకు పడ్డారన్నారు. డాక్టర్లు విధులకు వచ్చినా, రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారన్నారు. తమ జీతాలు అడగడం తప్పా అని నిలదీశారు. దీంతో సీఐటీయూ నాయకులు ఏడీతో మాట్లాడారు. కాంట్రాక్టర్‌ను, కార్మికులను ఒకచోట చేర్చి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్సై చెల్లించాలని కోరారు. ప్రతినెలా జీతాలు సకాలంలో ఇవ్వకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. వీటికి అధికారులు ఒప్పుకోవడంతో కార్మికులు ధర్నాను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement