గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం | - | Sakshi
Sakshi News home page

గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

ఆత్మకూరు: పట్టణంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు వీరంగం చేయడం పరిపాటిగా మారింది. సోమవారం 13వ వార్డులోని ఓ ఇంట్లోకి చొరబడి నలుగురు యువకులు గంజాయి మత్తులో కుటుంబ సభ్యులను కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వారు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైన దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. 13వ వార్డు దళితకాలనీ ప్రాంతంలో వెంకి అలియాస్‌ వెంకటేశ్వర్లు ఇంట్లోకి ఆదర్శ్‌, సుమంత్‌, బాబు, గోవింద్‌ అనే నలుగురు యువకులు మధ్యాహ్నంత 3.30 గంటల సమయంలో చొరబడ్డారు. ఇద్దరు లోపలికి వెళ్లగా మరో ఇద్దరు బయట ఉన్నారు. వెంకిని బయటకు రావాలని బెదిరించారు. అతను ఇంటి వద్ద లేడని మహిళలు చెబుతున్నా వినిపించుకోకుండా కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వెంకి కనిపిస్తే ఇక్కడే చంపేస్తామంటూ వీరంగం చేశారు. ఇంట్లోని మహిళలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి నలుగురు వెళ్లిపోయారు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి వద్ద నుంచి వచ్చిన నలుగురు యువకులు మున్సిపల్‌ బస్టాండ్‌ సమీపంలోని మద్యం దుకాణంలో ఉండగా ఇద్దరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. అయితే సుమంత్‌, ఆదర్శ్‌ వారిపై తిరగబడ్డారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాబు తప్పించుకున్నాడు. పట్టుబడిన గోవింద్‌, ఆదర్శ్‌, సుమంత్‌ను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ నెల మొదటి వారంలో ఏసీఎస్‌ఆర్‌కాలనీలో ఓ యువకుడు గంజాయి మత్తులో స్థానిక వ్యక్తిని బీరు బాటిల్‌తో తలపై గాయపరిచాడు. రెండు నెలల క్రితం టిడ్కో భవనాల్లో నివశిస్తున్న ఓ యువకుడు గంజాయి మత్తులో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు.

ఓ ఇంటి కుటుంబ సభ్యులపై

కత్తితో దాడికి యత్నం

వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే తిరగబడి దాడి

ఎట్టకేలకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement