● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● సమస్యలు విన్నవించిన అర్జీదారులు
నెల్లూరురూరల్: ‘సార్.. మేం చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో సోమవారం ప్రజాసస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ పవన్‌తేజ, తెలుగుగంగ ప్రత్యేకాధికారులు కేశవర్ధన్‌రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
జీవనాధారం తీసేస్తున్నారు
తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ భూమికి నీటి వసతి లేకుండా చేస్తున్నారని చేజర్ల మండలం రెడ్డివారి కండ్రిక గ్రామానికి చెందిన లెక్కల మాలకొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అర్జీ ఇచ్చిన అనంతరం మాట్లాడారు. తమ 20 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి సుమారు 25 ఏళ్ల క్రితం సోమశిల కాలువ వెళ్లిందని, అప్పటి నుంచి కాలువపై పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని వినియోగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. టీడీపీకి చెందిన వ్యక్తులు డీఈపై ఒత్తిడి తెచ్చి పైపులు తీయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు సూచనల మేరకే పైపులు ఏర్పాటు చేసుకున్నామని, వాటి వల్ల ఇతర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాజకీయ కారణాలతో వ్యవసాయానికి అడ్డంకులు సృష్టించకుండా అధికారులు స్పందించి, తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
డీఎస్సీలో అక్రమాలపై విచారణకు డిమాండ్
డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి షేక్ మున్నా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేసి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని ఉద్యోగ నియామకాలను ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరుద్యోగ యువతకు అండగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పునరావాసం కోసం ఎదురుచూపులు
కండలేరు ముంపు గ్రామమైన వండ్లూరు ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. బాధితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన కొందరికి ప్లాట్లు కేటాయించినప్పటికీ, కండలేరు జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు, దళితులు, బీసీ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ముంపు బాధితులతో కలిసి రాష్ట్ర రాజధానిలో అధికారులను కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.


