● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 162 మంది తమ సమస్యలను ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, ఎన్.రామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● అల్లూరు ప్రాంతానికి చెందిన వాణి, సుధామోహన్, జగదీష్ నాకు పరిచయమయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానని, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి రూ.18 లక్షలు తీసుకుని మోసగించారు. నగదు అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని చిల్లకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● గతేడాది డిసెంబర్‌లో నా భర్త మోటార్‌బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయపడ్డాడు. ప్రమాద ఘటనపై సమగ్రదర్యాప్తు జరిపి న్యాయం చేయాలని మర్రిపాడు ప్రాంతానికి చెందిన వివాహిత కోరారు.
● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు ఇంటి నుంచి గెంటేశారు. విచారించి న్యాయం చేయాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వివాహిత వినితపత్రం ఇచ్చారు.
● వెంకటరమణయ్య అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసును రాజీచేసుకోవాలని వెంకటరమణయ్య బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని దగదర్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు.
● నా భర్త విజయ్ ఒకటిన్నర నెల నుంచి కనిపించడం లేదు. చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి భర్త ఆచూకీ కనుక్కోవాలని వివాహిత అర్జీ సమ ర్పించారు.


