ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయొద్దు

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

కలెక్టరేట్‌ ఎదుట

వైఎస్సార్‌ టీయూసీ నిరసన

నెల్లూరురూరల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయొద్దని వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు రోజూ ఆర్టీసీ సేవలపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ అమలైతే మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రయాణ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక రవాణా సేవలు దెబ్బతింటాయని, వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే లాభాపేక్షకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తదితర వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతోపాటు సిబ్బంది నియామకాలు చేపట్టి, ఆధునిక సౌకర్యాలతో సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌, నియోజకవర్గ అధ్యక్షులు నవీకుమార్‌రెడ్డి, చెన్నారెడ్డి, పరంధామయ్య, వంశీ, శ్రీకాంత్‌, పెంచలయ్య, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement